హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా జనం తిప్పలు పడుతున్నారు. బ్యాంకు అకౌంట్లలో లక్షల రూపాయలు ఉన్నప్పటికీ పైసలు తీసుకోలేక పరేషాన్ అవుతున్నారు. యూపీఐ, ఆన్లైన్ చెల్లింపులు మరింత పెంచడానికి బ్యాంకులు క్యాష్ లిమిట్ పాటించాలంటూ ఆర్బీఐ నుంచి వచ్చిన ఆదేశాలే ఇందుకు కారణం. దీంతో బ్యాంకులు నగదు విత్డ్రా విషయంలో ఆంక్షలు అమలు చేస్తున్నాయి.
ఎస్బీఐ, యూబీఐతో పాటు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, పీఎన్బీ వంటి బ్యాంకులు భారీ ట్రాన్షాక్షన్లు నిర్వహించే బడా వ్యాపారులకు ఎంతంతే అంత నగదు చెల్లిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక మిగిలిన బ్యాంకులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని బ్రాంచిల్లో రైతులు, చిరువ్యాపారులకు రూ.10 వేల నుంచి రూ.50 లోపు మాత్రమే చెల్లిచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
10 రోజులుగా తిరుగుతున్నా.. పైసలు ఇస్తలేరు..
వ్యవసాయ పనులు మొదలైనయ్. కూలీలు, ఎరువుల కోసం పైసలు కావాలని బ్యాంకుకు పోతే రోజుకు రూ.10వేలే ఇస్తున్నరు. 10 రోజులుగా తిరుగుతున్నా చేతికి డబ్బు అందడం లేదు. లైన్‌లో నిలబడితే ముందున్న వారికే డబ్బులు అయిపోతున్నయి. అది కూడా ఒక్కొక్కరికి రూ. 10వేలకు మించి ఇవ్వడం లేదు. నా అకౌంట్‌లో క్రాప్ లోన్ పైసలు రూ.1,50,000 జమ అయ్యాయి. పని వదిలి పెట్టుకొని 15 రోజులు తిరిగితే గానీ ఆ పైసలు చేతికొచ్చేలా లేవు. రైతులకు లిమిట్ లేకుండా పైసలు ఇయ్యాలె.
రాస సమ్మయ్య, రైతు, పోచంపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
పంట అమ్మిన పైసలూ ఇస్తలేరు..
పంట అమ్మిన పైసలు నా అకౌంట్‌లో పడ్డయి. వాటి కోసం బ్యాంకుకు పోతే రోజుకు రూ.20 వేలు మాత్రమే ఇస్తున్నరు. బ్యాంకులో డబ్బులు లేవని, తర్వాత రావాలని చెబుతున్నరు. అత్యవసరమైతే ఆన్ లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలని అంటున్నారు. రోజుకు రూ.20వేలే ఇస్తే ఎన్ని రోజులు బ్యాంకుల చుట్టూ తిరగాలో అర్థం కావడం లేదు.
చిక్కుడు చెంద్రం, రైతు, తుక్కాపూర్, సిద్దిపేట జిల్లా
రూ.10 వేలే ఇస్తమంటున్నరు
పొలం దున్నాలని పైసల కోసం బ్యాంకుకు పోతే రూ.5 వేలు..10 వేలు మాత్రమే ఇస్తున్నరు.. దీంతో పనులు వదిలిపెట్టి వ్యవసాయ పెట్టుబడుల కోసం బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అత్యవసరం ఉండి ఒకేసారి రూ.50 వేలో, రూ.లక్షనో కావాలంటే క్యాష్ లేవంటున్నరు.
మల్లారెడ్డి, రైతు, గూడటిపల్లి, శంకరపట్నం, కరీంనగర్
‘రేపు’ రమ్మంటున్నరు..
నేను మూడెకరాల్లో మక్క, పెసర పంటలు సాగు చేశాను. వ్యవసాయ పనులకు అవసరమైన ఖర్చుల కోసం కోరుట్లలోని యూనియన్ బ్యాంకుకు వెళ్లి రూ.30 వేల క్రాప్ లోన్ కావాలని అడిగిన. కానీ బ్యాంకులో పైసలు లేవని, చెప్పి 'రేపు రండి' అంటూ వెనక్కి పంపిస్తున్నారు. ఇలా ఒక రోజు కాదు, చాలారోజులుగా తిరగాల్సి వస్తోంది. వ్యవసాయ పనులు మొదలు కావడంతో విత్తనాలు, ఎరువులు, మందులు కొనేందుకు డబ్బులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
కుడుదుల స్వామి, సంగెం, కోరుట్ల, జగిత్యాల జిల్లా
రూ.లక్ష కావాలంటే ఒక్కరోజు ముందే చెప్పాలట !
నాకు వీఎం బంజరు ఎస్‌బీఐలో అకౌంట్ ఉంది. రూ.లక్ష రూపాయలు డ్రా చేయాలంటే ఒకరోజు ముందుగా చెప్పాలని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. గతంలో రూ.5 లక్షల వరకు ఏ టైంలో వెళ్లి అడిగినా నగదు ఇచ్చేవారు. కానీ మూడు నెలల నుంచి రూ.లక్ష కావాలన్నా ఒకరోజు ముందే చెప్పాలంటున్నారు. లేదా చెక్, నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఏటీఎంలలో కూడా రోజువారి ట్రాన్సాక్షన్స్ రూ.20 వేల వరకే అంటూ బోర్డులు పెడుతున్నారు.
అన్నపూర్ణ, వీఎం బంజర, ఖమ్మం జిల్లా
