హుజూర్‌నగర్లో అమానుషం.. ఐరన్ రాడ్లతో కొట్టి, వేడి గరిటెతో చేతులు కాళ్లు కాల్చి.. కన్నబిడ్డలపై తల్లిదండ్రుల వేధింపులు..

హుజూర్‌నగర్లో అమానుషం..   ఐరన్ రాడ్లతో కొట్టి, వేడి గరిటెతో చేతులు కాళ్లు  కాల్చి.. కన్నబిడ్డలపై తల్లిదండ్రుల వేధింపులు..

నవమాసాలలు మోసిన కన్న తల్లికి చేతులెలా వచ్చాయో.. కన్న బిడ్డలను వేడి వేడి గరిటెతో కాల్చేందుకు. గుండెలపై ఆడించాల్సిన తండ్రికి మనసెలా వచ్చిందో.. ఐరన్ రాడ్లతో కొట్టడానికి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో జరిగిన ఈ అమానుష ఘటన.. ప్రతి ఒక్కరినీ కలచి వేసింది. ఎంతలా అంటే.. ఇరుగు పొరుగు వారే ఆ పసిబిడ్డల రోదన చూడలేక పోలీసుల సంరక్షణకు చిన్నారులను అప్పగించేంతలా.

హుజూర్ నగర్ టౌన్ కు చెందిన నకిరికంటి రవి, ఇందు దంపతులు అద్దె ఇంట్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు.  ఇద్దరు కుమారులు ధనుష్, రేవంత్‌లపై నిత్యం దాడులకు పాల్పడుతూ టార్చర్ చేస్తున్నారు.  ఐరన్ రాడ్లతో కొట్టి, వేడి గరిటెతో చేతులు, కాళ్లు కాల్చినట్లు చిన్నారులు చెప్పడం పోలీసులను కంటతడి పెట్టించింది.

చిన్నారుల బాధను చూసి చలించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిన్నారులను స్టేషన్‌కు తీసుకెళ్లి రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను స్థానికులు కోరారు. విషయం తెలుసుకున్న హుజుర్ నగర్ ఎస్సై నరేష్.. చిన్నారులకు భోజనం ఏర్పాటు చేసి ధైర్యం చెప్పారు. 

తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్  ఇచ్చారు. చిన్నారులపై వేధింపులు పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే చిన్నారులను అనాథాశ్రమంలో చేర్పించే అంశాన్ని పరిశీలిస్తామని ఈ సందర్భంగా ఎస్సై నరేష్ తెలిపారు.