నల్గొండ, వెలుగు: నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ బాలికల హాస్టల్‌లో కొంతకాలంగా తాగు నీటి కొరత నెలకొంది. ఈ సమస్య పరిష్కారం కోసం విద్యార్థినులు మంగళవారం అర్ధరాత్రి వీసీ గెస్ట్ హౌస్ ఎదుట ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టళ్లకు రావాల్సిన నీటిని నూతన భవన నిర్మాణాలకు మళ్లించడం వల్లే తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ విషయమై వైస్‌చాన్సలర్, రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లినా కేర్‌టేకర్లు, వార్డెన్లు పట్టించుకోకపోవడం లేదని విమర్శించారు.
మౌలిక వసతుల లేమితో తమ ఆరోగ్యం, చదువుపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని యాజమాన్యాన్ని హెచ్చరించారు.
