పద్మారావునగర్, వెలుగు: వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలగూడ బీదలబస్తీకి చెందిన శివగౌడ్ ఈ నెల 5న కుటుంబంతో కలిసి శుభకార్యానికి వెళ్లగా, గుర్తుతెలియని వ్యక్తి ఇంటి తాళాలు పగులగొట్టి నగదు, బంగారు ఆభరణాలు చోరీ చేశాడు.
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో తమ్మిశెట్టి రాజు(25) అనే కూలీని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితుడు చిలకలగూడలో చోరీ చేయడంతో పాటు అదే రోజు వారాసిగూడ పరిధిలో మరో ఇంట్లోనూ దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు.
చోరీ చేసిన బంగారంలో ఎక్కువ భాగాన్ని విక్రయించి అప్పులు తీర్చుకున్నట్లు వెల్లడించాడు. నిందితుడి వద్ద రూ.వెయ్యి, రెండు బంగారు ఉంగరాలను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపారు.
