Yogini ekadashi 2026: జ్యేష్ఠ మాసంలో చివరి ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? దీని ప్రాముఖ్యత ఏంటి? ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల సకల యోగాలు లభించడమే కాకుండా.. ఆర్ధిక సమస్యలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు.
జ్యేష్ఠ మాసంలో చివరి ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు. ఏకాదశి తిథి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది. ఈ రోజున శ్రీమహావిష్ణువును ఆచార వ్యవహారాలతో పూజిస్తారు. శ్రీమహావిష్ణువును పూజించడం ద్వారా కోరిన కోర్కెలు నెరవేరుతాయి. ఈ ఏడాది ( 2026) అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది. నిజ జ్యేష్ఠమాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి రోజును ( జులై 10) యోగిని ఏకాదశి గా జరుపుకుంటారు.
హిందూ మతంలో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి తిథి ప్రతి నెల రెండుసార్లు వస్తుంది. కృష్ణ పక్షంలో ఒకటి, శుక్ల పక్షంలో ఒకటి. ఒక సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంటుంది. యోగిని ఏకాదశి రోజు ( 2026 జులై 10 ) ఉపవాసం ఆచరించి విష్ణువును పూజిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. ఈ ఏడాది యోగిని ఏకాదశి జులై 10 వ తేదీ వచ్చింది. దేవశయని ఏకాదశికి ముందు ఈ యోగిని ఏకాదశి వస్తుంది.
పురాణాల ప్రకారం యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించిన వ్యక్తికి 88 వేల మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. అంతేకాదు మరణించిన తర్వాత ఆత్మకు మోక్షం లభించి వైకుంఠ ప్రవేశం పొందుతారని పండితులు చెబుతున్నారు.
యోగిని ఏకాదశి శుభ ముహూర్తం
- పంచాంగం ప్రకారం యోగిని ఏకాదశి తిథి ప్రారంభం: జులై 10 శుక్రవారం ఉదయం 8:10
- యోగిని ఏకాదశి తిథి ముగింపు :జులై 11న ఉదయం 5:23 గంటలకు
- ఏకాదశి ఉపవాస దీక్ష పాటించాల్సిన రోజు: జులై 10 శుక్రవారం
ఎప్పుడు జరుపుకోవాలి
జూలై 11న సూర్యోదయానికి ముందే ఏకాదశి ముగిసి ద్వాదశి ప్రారంభమవుతుంది. అంటే ఆచరణలో 11వ తేదీన ఏకాదశి తిథి లోపిస్తుంది(క్రయమవుతుంది) కాబట్టి సూర్యోదయం సమయంలో ఏకాదశి తిథి లేకపోవడం కారణంగా మొదటిరోజే యోగినీ ఏకాదశి ఉపవాస దీక్షను ఆచరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి జూలై 10న ఉపవాస దీక్ష కొనసాగించాలని పండితులు అంటున్నారు.
యోగిని ఏకాదశి.. శుభ యోగాలు
యోగిని ఏకాదశి ఉపవాసం రోజున ధ్రుతి, శూలం, గండ యోగాలు ఉన్నాయి. దృతి యోగం యోగం జులై 10 శుక్రవారం ఉదయం 7.14 గంటలకు ప్రారంభమవుతుందిం. ఆ తరువాత మరుసటి రోజు అంటే జులై 11 తెల్లవారుజామున 3.50 గంటలకు శూలయోగం ... గండయోగం 4.43 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ మూడుయోగాలు మరుసటి రోజు అర్ధరాత్రి 12.05 గంటల వరకు ఉంటాయని పండితులు చెబుతున్నారు.
►ALSO READ | లక్కీ నంబర్ 7 ఉన్నవాళ్లతో పెట్టుకుంటే అంతే.. పైకి సైలెంట్.. కానీ మనసులో ఏముంటుందో తెలుసా?
యోగిని ఏకాదశి ప్రాముఖ్యత
యోగిని ఏకాదశి రోజు లక్ష్మీ నారాయణుడిని పూజిస్తారు. పద్మ పురాణం ప్రకారం యోగిని ఏకాదశి ఉపవాసం ఆచరించడం వల్ల ఎన్నో యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. జన్మ జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. యోగిని ఏకాదశి రోజు రాత్రి జాగారం చేసి విష్ణు నామ స్మరణ చేయాలి. ఇలా చేయడం వల్ల సంపద, సంతోషం, శ్రేయస్సుతో పాటు ఆర్థిక కష్టాలు తొలగుతాయి. ఈ యోగిని ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. చర్మ రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. యోగిని ఏకాదశి గురించి స్వయంగా శ్రీకృష్ణుడు యుధిష్టిరుడికి చెప్పినట్టుగా బ్రహ్మ పురాణం చెబుతోంది.
పూజా విధానం
- యోగిని ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి.
- పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. గంగాజలంతో అభిషేకించాలి.
- శ్రీ మహా విష్ణువుకు పసుపు రంగు అంటే చాలా ఇష్టం.అందుకే ఈరోజున పసుపు రంగు దుస్తులను ధరించాలి.
- విష్ణుమూర్తికి పసుపు రంగు పూల హారాన్ని సమర్పించాలి.
- శ్రీహరి పూజలో పండ్లు, స్వీట్లు, పువ్వులు పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలి.
- యోగినీ ఏకాదశి వేళ ఏకాదశి కథను వినాలి. మరుసటి రోజు ఉపవాస దీక్షను విరమించాలి.
ఇవి దానం చేయండి..
- యోగినీ ఏకాదశి వేళ పేదలకు అన్నదానం చేయాలి. ఇలా చేయడం వల్ల శ్రీ మహా విష్ణువు అనుగ్రహం లభిస్తుంది.
- పేదలకు బట్టలు దానం చేయడం వల్ల మీ పాపాలన్నీ తొలగిపోతాయి.
- యోగినీ ఏకాదశి రోజున నెయ్యిని దానం చేయడం వల్ల తెలివితేటలు, మేధస్సు పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే నెయ్యిని దేవతల ఆహారంగా పరిగణిస్తారు.
- బ్రాహ్మణులకు దక్షిణను దానం చేయాలి. ఈ రోజున దక్షిణ దానం చేయడం వల్ల జ్ఞానము.. తెలివి తేటలు లభిస్తాయి
- నువ్వులను దానం చేయడం వల్ల గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో సుఖసంతోషాలు లభిస్తాయి.
- పండ్లను దానం చేయడం వల్ల ఆరోగ్య పరంగా మెరుగైన ఫలితాలొస్తాయి.
- గోమాతను దానం చేయడం వల్ల మోక్షం లభిస్తుంది
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని వేదపండితులు.. ఆధ్యాత్మికవేత్తల సమాచారంమేరకు .. ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు.మీకున్న సమస్యలకు వేదపండితులను సంప్రదించడం ఉత్తమం
