కాజీపేట జంక్షన్ సమీపంలో ప్రాణాలు కాపాడిన '108' సిబ్బంది

కాజీపేట జంక్షన్ సమీపంలో ప్రాణాలు కాపాడిన '108' సిబ్బంది

హనుమకొండ, వెలుగు: కాజీపేట జంక్షన్ సమీపంలో రైలు నుంచి ప్రమాదవశాత్తు కిందపడిన ఓ యువకుడిని 108 అంబులెన్స్ సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడారు. బుధవారం ఉదయం ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన ఫర్హాన్ (19) లక్నో వెళ్లే రైలు నుంచి వడ్డేపల్లి చెరువు సమీపంలో కిందపడగా, దవడ, గొంతు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 ఈఎంటీ లింగాల శివకుమార్, పైలట్ కుంట రవి ఘటనాస్థలికి చేరుకున్నారు.

అక్కడికి వాహనం వెళ్లే మార్గం లేకపోవడంతో దాదాపు కిలోమీటరున్నర మేర రైల్వే ట్రాక్‌‌పై నడిచి వెళ్లి, గాయపడిన యువకుడిని స్ట్రెచర్‌‌పై మోసుకొచ్చి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. '108' సేవలను ప్రారంభించిన వైఎస్సార్ జయంతి రోజునే అంబులెన్స్ సిబ్బంది చూపిన ఈ సాహసం స్థానికుల ప్రశంసలు అందుకుంది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.