ఎల్బీనగర్, వెలుగు: క్రీడలు పోలీసు సిబ్బందిలో క్రమశిక్షణ, ఐక్యత, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు విధి నిర్వహణలో సామర్థ్యాన్ని పెంచుతాయని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బుధవారం 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడారు.
ఈ ఏడాది నుంచి ఆలిండియా పోలీస్ గేమ్స్ తరహాలో క్లస్టర్ల వారీగా పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రెజ్లింగ్, బాక్సింగ్, బాడీ బిల్డింగ్, ఆర్మ్ రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, పవర్‌లిఫ్టింగ్, యోగా, జూడో, వుషూ, తైక్వాండో, కరాటే, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, పెన్‌కాక్ సిలాట్ సహా 14 ఇండోర్ క్రీడల్లో పోటీలు జరుగుతున్నాయని చెప్పారు. సీపీ బి. సుమతి మాట్లాడుతూ.. పోలీస్ గేమ్స్ క్రమశిక్షణ, టీమ్‌వర్క్, నైపుణ్యాన్ని పెంపొందించే వేదిక అని చెప్పారు.
ఐజీ డాక్టర్ గజారావు భూపాల్ మాట్లాడుతూ.. క్లస్టర్–ఏ పోటీల్లో రాష్ట్రంలోని 21 పోలీస్ యూనిట్ల నుంచి 831 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని, అందులో 683 మంది పురుషులు, 148 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. క్రీడలు పోలీసు సిబ్బందిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ఫిట్‌నెస్‌ను పెంపొందిస్తాయని అన్నారు. సినీ నటుడు నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ, ప్రజల భద్రత కోసం నిరంతరం సేవలందిస్తున్న పోలీసులే సమాజంలోని నిజమైన హీరోలని కొనియాడారు.
