కరాచీ: వెస్టిండీస్, ఇంగ్లండ్ పర్యటనలకు ముందు పాకిస్థాన్ టెస్టు టీమ్ ప్లేయర్ల ఫిట్‌నెస్ ఇంకా ఆందోళనకరంగానే ఉందని హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. లాహోర్‌లో నెల రోజులపాటు నిర్వహించిన రెడ్‌బాల్ శిక్షణ శిబిరంలో కొందరు ఆటగాళ్లకు ఫిట్‌నెస్ సమస్యలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఇప్పటికే కొన్ని సమస్యలను పరిష్కరించినా, ఇంకా మిగిలి ఉన్నాయని వెల్లడించారు.
వాటి పరిష్కారం కోసం గురువారం నుంచి ఇస్లామాబాద్‌లో క్యాంప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కొత్త టెస్టు కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై విశ్వాసం ఉందని సర్ఫరాజ్ పేర్కొన్నారు. రానున్న పర్యటనల్లో జట్టును విజయవంతంగా నడిపిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవల పీసీబీ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన బాబర్.. కెప్టెన్‌గా ఫిట్‌నెస్, క్రమశిక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని చెప్పాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని, వైట్‌బాల్ క్రికెట్ ఎంత పెరిగినా ఆటగాడి అసలు స్థాయి టెస్టు క్రికెట్‌లోనే తేలుతుందని వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్ జట్టు వెస్టిండీస్‌తో రెండు, ఇంగ్లండ్‌తో మూడు టెస్టులు ఆడనుంది.
