- అవగాహన పెంచడం కోసమే సర్పంచ్‌లకు ప్రత్యేక శిక్షణ ప్రోగ్రామ్
మహబూబాబాద్, వెలుగు: ప్రతి సర్పంచ్ తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలపడానికి ముందుకు సాగాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కోరారు. బుధవారం మహబూబాబాద్జిల్లా కేంద్రంలో నిర్వహించిన సర్పంచ్ ల అవగాహన సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వీబీజీరామ్‌జీ (వికసిత్ భారత్ - గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్) చట్టంపై అవగాహన కల్పించడంతోపాటు, గ్రామ పరిపాలనకు సంబంధించిన 8 అంశాలపై శిక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అధికారుల ద్వారా నేర్చుకున్న విషయాలను గ్రామాల్లో అమలు చేయాలని సూచించారు. గతంలో ఈజీఎస్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయించేదని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ వాటా పెంచడంతో ప్రభుత్వం పై ఆర్థిక భారం పడుతుందన్నారు.
గ్రామీణ స్థాయిలోనే ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో వీధి కుక్కలను నియంత్రణ, పచ్చదనం, పరిశుభ్రత, తాగునీరు, కూలీలకు పని కల్పించడం, ఇంకుడు గుంతల నిర్మాణం విరివిగా చేపట్టడం కొనసాగించాలన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ దివ్య కృషితోనే ఇప్పపువ్వు లడ్డులు ప్రధాని మోదీతో ప్రశంసలు అందుకున్నట్లు చెప్పారు. ఆదర్శ గ్రామాలకు రూ.25 లక్షలు నుంచి రూ.కోటి వరకు ప్రోత్సాహక నిధులు అందించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ దివ్య, మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీశ్, ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు, సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
