వరంగల్లో గవర్నర్ పర్యటన

వరంగల్లో గవర్నర్ పర్యటన

గ్రేటర్​ వరంగల్, వెలుగు: వరంగల్​ జిల్లాలో గురువారం గవర్నర్  శివప్రతాప్  శుక్లా పర్యటించనున్నారు. హన్మకొండ, వరంగల్  జిల్లా పర్యటన నేపథ్యంలో హన్మకొండ, వరంగల్​ కలెక్టర్లు చాహత్  బాజ్ పాయి, డాక్టర్  సత్యశారద, పోలీస్  కమిషనర్  ఎన్.శ్వేత బుధవారం హన్మకొండ ఐడీఓసీలో జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. గవర్నర్  పర్యటన షెడ్యూల్‌‌ను శాఖల వారీగా సమీక్షించారు. 

భద్రత, ప్రొటోకాల్, ట్రాఫిక్, పారిశుధ్యం, వైద్య సేవలు, విద్యుత్, తాగునీరు, పార్కింగ్, మీడియా నిర్వహణ తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. గవర్నర్  ఉదయం ఎన్‌‌ఐటీ వరంగల్  చేరుకుంటారు. హన్మకొండ ఐడీఓసీ ఆవరణలో నషా ముక్త్  భారత్  ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తారు.

స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన వివిధ ఉత్పత్తుల స్టాళ్లను సందర్శించి, మహిళలతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత పెద్దమ్మగడ్డలోని తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్  సెంటర్  ఆఫ్  ఎక్సలెన్స్ ను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడనున్నారు.

విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలను పరిశీలిస్తారు. అలాగే హన్మకొండ, వరంగల్  జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించి అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తారు. మధ్యాహ్నం హన్మకొండలోని ఇండియన్  రెడ్‌‌ క్రాస్  సొసైటీని సందర్శించి అక్కడి సేవలను పరిశీలిస్తారు. సాయంత్రం భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హైదరాబాద్‌‌కు బయలుదేరుతారు.