- కమిషనర్‌ను కలవడంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కామెంట్
- కాంట్రావర్సీ కాదు.. అభివృద్ధిని పట్టించుకోవాలని సూచన
జనగామ/ స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు: తనకు రూల్స్, పరిమితులు, అధికారాలపై పూర్తి అవగాహన ఉందని.. ఒక ఎమ్మెల్యేగా ఏ ప్రభుత్వ అధికారినైనా కలిసే హక్కు తనకు ఉందని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఆ హక్కు ప్రకారమే తాను అధికారులను కలిశానని, తాను ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తనపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎక్కడా మంత్రి సురేఖ పేరు ఎత్తకుండానే ఆమెకు కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. తాను అధికారులను ఒకచోటికి పిలిపించుకుంటే దాన్ని సమీక్ష అంటారని.. కానీ తానే స్వయంగా అధికారుల వద్దకు వెళ్లానని శ్రీహరి గుర్తుచేశారు. జీడికల్ సహా తన నియోజకవర్గంలోని ఐదు దేవాలయాల అభివృద్ధి, అక్కడ నెలకొన్న సమస్యలపై ఆలయ చైర్మన్లతో కలిసి దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావును కలిసి మాట్లాడినట్లు తెలిపారు.
ఆలయాల్లోని ప్రధాన సమస్యలను గుర్తించి తనకు తెలియజేస్తే, తానే స్వయంగా సీఎంని కలిసి నిధులు కోరతానని కమిషనర్‌కు చెప్పినట్లు వివరించారు. తాను ఉమ్మడి వరంగల్ లేదా తెలంగాణలోని ఇతర దేవాలయాల గురించి మాట్లాడలేదని, అవగాహన లోపంతో తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.బిజినెస్ రూల్స్ ప్రకారం.. మంత్రులు మాత్రమే సమీక్షలు చేస్తారనే విషయం తనకూ తెలుసన్నారు. అయితే, సంబంధిత మంత్రికి తెలియకుండా ఆ శాఖ పరిధిలోని అధికారులను ఎమ్మెల్యేలు కలవకూడదనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అభివృద్ధి, ప్రజల సంక్షేమం పట్టని వారే ఇలాంటి అనవసర వివాదాలు సృష్టించుకొని మాట్లాడుతారని శ్రీహరి ఆరోపించారు.
వరంగల్ సమస్యలు పట్టించుకోవాల్సింది ఎవరు?
ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, దాని గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత ఎవరిదని శ్రీహరి నిలదీశారు. జిల్లాలోని ముఖ్యమైన దేవాదుల ప్రాజెక్టుపై దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఎవరిపై ఉందని, ఎంజీఎం ఆసుపత్రికి సూపరింటెండెంట్ లేకపోవడం, సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవాన్ని ఎవరు పట్టించుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే మంజూరైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఎస్టిమేట్ వేసి టెండర్లు పిలవాల్సిన చొరవ ఎవరు తీసుకోవాలని ప్రశ్నించారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వారి సంక్షేమం కోసం ఉపయోగించుకోవాలే తప్ప, ఇలాంటి రాజకీయ వివాదాల కోసం కాదని కడియం శ్రీహరి హితవు పలికారు.
