నల్లబెల్లి, వెలుగు: కుటుంబ గొడవలతో సాదుకున్న కొడుకే.. తండ్రిని కొట్టి చంపాడు. హత్యకు మృతుడి రెండో భార్య సహకరించింది. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లిలో బుధవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన మహ్మద్అంకూస్(59) ములుగు జిల్లా కేంద్రంలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.
ఇతడి మొదటి భార్యతో సంతానం లేకపోవడంతో ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన ఫాతిమాను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు కూడా పిల్లలు కలగకపోవడంతో అనాథ శరణాలయం నుంచి ఓ బాలుడిని దత్తత తీసుకొని అయూబ్ ఖాన్ గా నామకరణం చేశారు. బుధవారం ఉదయం అంకూస్ బాత్ రూంలో జారిపడి గాయపడ్డాడు.
ఫాతిమా, అయూబ్ ఖాన్ కలిసి 108కు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది వచ్చి అంకూస్ ను పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే మృతుడి ఒంటిపై గాయాలు ఉండడంతో అనుమానం వచ్చిన అంకూస్ సోదరి మహబూబాబీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎంక్వైరీ చేయడంతో ఫాతిమా, అయూబ్ ఖాన్ కలిసి కొట్టి చంపినట్లు తేలింది. దీంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు నల్లబెల్లి ఎస్సై సాయి ప్రసన్నకుమార్ తెలిపారు.
