హైదరాబాద్: బస్సు కోసం బస్ స్టాప్లో ఎదురు చూస్తున్న జనాల పైకి బొలెరో దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు స్పాట్లోనే చనిపోయారు. ఈ ఘోరమైన ఘటన శంషాబాద్ GHMC పరిధిలోని సాతం రాయి దగ్గర.. బెంగళూరు జాతీయ రహదారిపై జరిగింది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొలెరో వాహనం బీన్స్ లోడుతో శంషాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళుతుండగా సాతం రాయి దగ్గరకు రాగానే బస్సును ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో అదుపు తప్పి బోల్తా కొట్టింది.
బోల్తా కొట్టిన ప్రదేశంలో ఆర్టీసీ బస్ స్టాప్ ఉండడంతో బస్సు కోసం వేచి ఉన్న జనాలపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సాతం రాయికి చెందిన సుమ, సువర్ణ అనే ఇద్దరు మహిళలు సంఘటనా స్థలంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతులను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
స్థానికులు మాట్లాడుతూ... ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఎలాంటి బారికేడ్లు లేకపోవడంతో రోడ్డు దాటాలన్నా, బస్ స్టాప్లో బస్సు కోసం వేచి చూడాలన్న ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉండాల్సి వస్తుందని అంటున్నారు. ఎన్నో ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న పట్టించుకునే నాధుడు కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ బస్ స్టాప్ ఉండడంతో అనేక మంది బస్సు కోసం వేచి చూస్తారు కాబట్టి ఇక్కడ వాహనాలు నెమ్మదిగా వెళ్లేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయాలి లేదా ట్రాఫిక్ పోలీసును ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.
