హారన్ మోతలు.. చెవులకు చిల్లులు.. హైదరాబాద్ సిటీలో రోడ్డు పైకొస్తే శబ్ద నరకమే !

హారన్ మోతలు.. చెవులకు చిల్లులు.. హైదరాబాద్ సిటీలో రోడ్డు పైకొస్తే శబ్ద నరకమే !
  • సైలెన్స్ జోన్లలోనూ హారన్​ కొడుతున్న వాహనదారులు
  • మానసిక, శారీరక ఆరోగ్యానికి దెబ్బ 
  • చట్టం ప్రకారం అనవసరంగా  హారన్ ​కొడితే జరిమానా 
  • ఎక్కడా అమలు కావట్లే

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ జామ్‌‌లతోనే కాదు..చెవులు చిల్లులు పడే హారన్ల శబ్దాలతోనూ నరకం కనిపిస్తోంది. అవసరం లేకపోయినా ఎదురుగా బండి వెళ్తే చాలు హారన్​కొట్టడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. ఇక జంక్షన్ల దగ్గర రెడ్ సిగ్నల్ పడకముందే, పడినా ముందు వాహనం కదలకపోయినా నాన్​స్టాప్​గా హారన్లు మోగిస్తూనే ఉంటారు. సైలెన్స్ జోన్లయిన దవాఖానలు, స్కూల్స్ దగ్గర హారన్లు కొట్టకూడదన్న సంగతి కూడా చాలామందికి తెలియడం లేదు. 

ఈ శబ్ద కాలుష్యం చెవుడును మాత్రమే కాదు..వాహనదారుల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మోటార్ వెహికల్ యాక్ట్​సెక్షన్ 194 ఎఫ్​ప్రకారం..అనవసరంగా హారన్​కొట్టినా లేదా సైలెన్స్​జోన్​లో హారన్​వాడినా రూ. వెయ్యి నుంచి రూ.2 వేల వరకు జరిమానా విధించొచ్చు. కానీ ఫీల్డ్​లెవెల్​లో ఇది ఎక్కడా అమలు కావడం లేదు.  

బీపీ, ఆందోళనకు కారణం..
రోడ్లపై విపరీతమైన హారన్ల శబ్దాల మధ్య గంటల తరబడి గడపడం వల్ల వాహనదారుల్లో తెలియకుండానే తీవ్ర మానసిక ఒత్తిడి పెరుగుతోందని సైకియాట్రిస్ట్‌‌లు చెప్తున్నారు. ఎడతెరిపి లేని హారన్ల శబ్దం మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దీనివల్ల డ్రైవింగ్ చేసే వారిలో యాంగ్జైటీ (ఆందోళన), క్షణికావేశం, చిరాకు పెరిగిపోతాయని అంటున్నారు.

మరోవైపు, అకస్మాత్తుగా, పెద్దగా వచ్చే హారన్ల వల్ల శరీరంలో బ్లడ్ ప్రెజర్ ఒక్కసారిగా పెరిగి, దీర్ఘకాలంలో గుండె జబ్బులకు దారితీసే ప్రమాదం ఉందని కార్డియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ప్రధాన చౌరస్తాల్లో శబ్దాల తీవ్రత 85 నుంచి 100 డెసిబెల్స్ దాటుతుండటంతో నిత్యం ట్రాఫిక్‌‌లో ఉండే పోలీసులు, బైకర్లు వినికిడి లోపానికి గురవుతున్నారు.

మైండ్ సెట్ మారాల్సిందే..
హారన్​ను కేవలం ప్రమాదాలను నివారించడానికి, అవతలి వారిని అప్రమత్తం చేయడానికి మాత్రమే వాడాలనే కనీస జ్ఞానాన్ని చాలామంది వాహనదారులు మరిచిపోయారు. ముందు వాహనం కదిలే అవకాశం లేకపోయినా హారన్​కొడితే దారి దొరకదనే విషయాన్ని గమనించడం లేదు. 

ఈ శబ్ద కాలుష్యానికి అడ్డుకట్ట పడాలంటే రూల్స్​ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు, లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా హారన్​కొట్టడం వల్ల అవతలి వారితో పాటు తమ ఆరోగ్యం కూడా పాడవుతుందనే స్పృహ వాహనదారుల్లో రావాల్సిన అవసరం ఉందంటున్నారు.  

సిటీలో ట్రాఫిక్ వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలు ఉప్పల్ క్రాస్‌రోడ్స్ 
వద్ద నిర్వహించిన 'నో హాంకింగ్' క్యాంపెయిన్‌లో భాగంగా వాహనాల హారన్ల శబ్దాలను కొలవగా, పాత ఆర్టీసీ బస్సుల హారన్లు, కొన్ని ప్రైవేట్ లారీల హారన్లు ఏకంగా 100 నుంచి 113 డెసిబెల్స్ వరకు శబ్దం చేస్తున్నట్టు తేలింది.

నగరంలో రోడ్లపై ఐదేండ్లుగా డ్యూటీలు చేసే ట్రాఫిక్​ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 76 శాతం మంది 'సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్' లక్షణాలతో బాధపడుతున్నట్లు తేలింది. లారీలు, ఆటోలు, బైక్‌ల హారన్ల శబ్దాల వల్లే చెవి లోపలి నరాలు దెబ్బతిన్నాయని డాక్టర్లు నిర్ధారించారు.

కొట్టు ఇంకా హారన్​ కొట్టు! 
రణగొణ ధ్వనుల నుంచి విముక్తి పొందడానికి సంగీత వాయిద్యాల ధ్వనితో హారన్లు తెచ్చేలా కేంద్రం ప్రతిపాదనలు తెచ్చింది. దీని ప్రకారం భవిష్యత్తులో వాహనాల హారన్లు కర్ణకఠోరంగా కాకుండా ఫ్లూట్ (పిల్లనగ్రోవి), తబలా, వయలిన్, హార్మోనియం శబ్దాలను  వినిపించనున్నాయి. ఇక అంబులెన్సులు, పోలీస్ వాహనాలపై ఉండే విసుగు పుట్టించే సైరన్ల స్థానంలో ఆకాశవాణి (ఆల్‌ ఇండియా రేడియో) ట్యూన్‌లను ఉపయోగించేలా మార్పులు చేయాలని చూస్తున్నారు. 

మిజోరాంలో హారన్​ వినిపించదు
భారతదేశంలో హారన్ల శబ్దం అస్సలు వినిపించని ఏకైక నగరంగా మిజోరాం రాజధాని ఐజ్వాల్ నిలిచింది. దీనిని హాంక్​ఫ్రీ సిటీ అని పిలుస్తారు. ఇక్కడ ఎలాంటి జరిమానాలు, కెమెరాల అవసరం లేకుండానే ప్రజలు అద్భుతమైన సంస్కృతిని అలవర్చుకున్నారు. ఇక్కడ ఎంత భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడినా, అత్యవసర పరిస్థితి (అంబులెన్స్ వంటివి) ఉంటే తప్ప ఏ ఒక్క వాహనదారుడు హారన్ కొట్టడు. టూరిస్టులు ఎవరైనా తెలియక హారన్ కొట్టినా, స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు నచ్చజెప్పి హారన్ కొట్టకుండా నియంత్రిస్తారు.

ఉదయం, సాయంత్రం ఎక్కువ
ఐఐఐటీ హైదరాబాద్ తాజా అధ్యయనం సిటీలో ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో హారన్ల మోతల వల్ల శబ్ద తీవ్రత ఏకంగా 90 నుంచి 110 డెసిబెల్స్ పైగా నమోదవుతోంది. గచ్చిబౌలి,  జీడిమెట్ల, ఉప్పల్ కారిడార్లలో అత్యధికంగా హారన్ల శబ్దాలు రికార్డయ్యాయి. సెంట్రల్​పీసీబీ అనుమతించిన పరిమితి 65 డెసిబుల్స్​కాగా, సిటీ సగటు శబ్దం 80.66 డెసిబుల్స్​గా తేలింది. దీనివల్ల వాహనదారుల ఆలోచనా శక్తి దెబ్బతిని ప్రమాదాలు జరగడానికి కారణమవుతోందని  ఐఐఐటీ హైదరాబాద్ హెచ్చరించింది.

కేరళలో లైసెన్స్ రద్దు
2019 జూన్-, జులై నెలల్లో కేరళలోని కొచ్చి, తిరువనంతపురం నగరాల్లో సైలెన్స్ జోన్ల (కోర్టులు, విద్యాసంస్థలు) వద్ద శబ్ద తీవ్రతను కొలిచే పరికరాలను ఏర్పాటు చేశారు. అనవసరంగా హారన్ ​కొడితే రూ.వెయ్యి జరిమానా విధించారు. రెండోసారి దొరికిపోతే రూ.2 వేల జరిమానాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌‌ను 3 నెలల పాటు సస్పెండ్ చేశారు.

సైలెంట్ జోన్లలోని రోడ్లపై మైక్రోఫోన్లు డెసిబెల్ మీటర్లు అమర్చారు. ఇక్కడ మధ్యాహ్నం వాహనాల హారన్ శబ్దం 50 డెసిబల్స్ దాటితే ఇవి అలర్టవుతాయి. హారన్​ మోగితే నేరుగా వాహనదారుడి ఇంటికి ఈ- చలాన్ వెళ్తుంది. కేరళ ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఒక రోడ్డును నో హారన్​జోన్ గా మార్చడానికి నిర్ణయం తీసుకుంది. 2018లోనే ఎర్నాకులం (కొచ్చి) జిల్లాలోని ఎంజీ రోడ్డును మొదటి అధికారిక నో హారన్​జోన్​గా మార్చింది. 

ముంబైలో ‘ది పనిషింగ్ సిగ్నల్’  
సిగ్నల్ పడకముందే విపరీతంగా హారన్​కొట్టే అలవాటును అడ్డుకోవడానికి  2019 నవంబర్​, డిసెంబర్ ​నెలల్లో ముంబై ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయోగం చేశారు. కొన్ని చౌరస్తాల్లో ట్రాఫిక్ సిగ్నళ్లకు డెసిబెల్ మీటర్లు అమర్చారు. హారన్ల శబ్దం 85 డెసిబెల్స్ దాటితే.. ఆ సిగ్నల్ టైమర్ మళ్లీ మొదటికి(రీసెట్) వచ్చేస్తుంది. ఎంత ఎక్కువ హారన్​ కొడితే అంత ఎక్కువ సేపు రెడ్ సిగ్నల్ వద్ద ఆగాల్సి వస్తుందన్నమాట. ఆ వీడియోను జనవరి 2020లో సోషల్ మీడియాలో పోస్ట్​చేయడంతో విపరీతంగా వైరలయ్యింది.

‘ఎక్కువ హారన్​కొడితే.. ఎక్కువ సేపు వేచి ఉండాలి (హాంక్ మోర్, వెయిట్ మోర్) అనే ఈ కాన్సెప్ట్ వాహనదారుల్లో పెద్ద మార్పు తెచ్చింది. అయితే, వాహనదారుల్లో మార్పు తేవడానికి, వారికి కాస్త కఠినంగా అర్థమయ్యేలా చెప్పడానికి చేసిన పైలట్ ప్రాజెక్ట్ మాత్రమేనని, శాశ్వతంగా అమలు సాధ్యం కాదని ముంబై పోలీసులు ప్రకటించారు.