ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రతి పెద్ద సంస్కరణ మొదట గొప్ప ఆశయాలతోనే ప్రజల ముందుకు వస్తుంది. ఆర్థిక సంస్కరణలు, పన్ను విధానాలు, వ్యవసాయ మార్పులు, ఇంధన విధానాలు...ఇలా ప్రతి నిర్ణయం దేశ భవిష్యత్తును మార్చగలదనే వాగ్దానంతో ప్రారంభమవుతుంది. కానీ ఒక విధానం విజయాన్ని .. ప్రజల జీవితాల్లో తీసుకొచ్చే వాస్తవ మార్పులే నిర్ణయిస్తాయి.
అందుకే ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వ విధానమైనా ప్రశంసలతోపాటు ప్రశ్నలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రశ్నలు అభివృద్ధికి అడ్డంకి కావు. మెరుగైన విధాన రూపకల్పనకు అవే పునాది. కేంద్ర ప్రభుత్వం E20 (20 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్)ను భారతదేశ భవిష్యత్ ఇంధన విధానంలో ఒక కీలక సంస్కరణగా ప్రకటించింది.
ప్రభుత్వం దృష్టిలో ఇది కేవలం ఇంధన మార్పు కాదు. విదేశీ చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే వ్యూహం. దేశీయ బయోఫ్యూయల్ పరిశ్రమను బలోపేతం చేసే ఆర్థిక విధానం, కార్బన్ ఉద్గారాలను తగ్గించే పర్యావరణ చర్య. ఈ లక్ష్యాలన్నీ వినడానికి ఆకర్షణీయంగానే ఉంటాయి. అయితే ప్రజా విధానాలను కేవలం ఆశయాల ఆధారంగా అంచనా వేయడం సరిపోదు. ఆ ఆశయాలు వాస్తవంలో ఎలా అమలవుతున్నాయి? వాటివల్ల దేశానికి ఎంత లాభం? ప్రజలకు ఎంత భారం? అనే ప్రశ్నలకు సమాధానం వెతకాల్సిందే.
అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగిన ప్రతిసారి దేశ ఆర్థికవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో దేశీయంగా ఉత్పత్తి చేయగల ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించాలనే ఆలోచన సహేతుకమైనదే. కానీ ప్రత్యామ్నాయ ఇంధనం పేరుతో తీసుకొచ్చే ప్రతి సంస్కరణ కూడా శాస్త్రీయంగా, ఆర్థికంగా, పర్యావరణపరంగా సమతుల్యంగా ఉండాలి. లేకపోతే ఒక సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో మరో పెద్ద సమస్యను సృష్టించే ప్రమాదం ఉంటుంది.
ప్రశ్నించడం కూడా అవసరం
ప్రభుత్వం E20 వల్ల చమురు దిగుమతులు తగ్గుతాయని, విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని, కాలుష్యం తగ్గుతుందని చెబుతోంది. అయితే ఇదే సమయంలో కొన్ని సహజమైన ప్రశ్నలు కూడా ముందుకు వస్తున్నాయి. ఇథనాల్ ఉత్పత్తి కోసం అవసరమయ్యే నీటి వినియోగం ఎంత? పాత వాహనాలు ఈ ఇంధనానికి ఎంతవరకు అనుకూలంగా ఉంటాయి? మైలేజీ తగ్గితే సాధారణ వాహనదారుడిపై అదనపు ఆర్థికభారం ఎంత? చెరకు సాగు పెరగడం వల్ల నీటి వనరులు, ఆహార భద్రతపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం ప్రజలకు సమగ్రంగా సమాధానం ఇచ్చిందా?
ఇక్కడే విధాన విశ్లేషణ అవసరం మొదలవుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందిస్తుంది. కానీ ఆ విధానాన్ని శాస్త్రీయంగా సమీక్షించడం, దాని బలాలు, బలహీనతలను పరిశీలించడం, ప్రజల ప్రయోజనాల దృష్టితో ప్రశ్నించడం కూడా అంతే అవసరం. ఒక విధానాన్ని ప్రశ్నించడం అంటే దాన్ని వ్యతిరేకించడం కాదు. దాన్ని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా మార్చాలనే ప్రయత్నం.
ఇంధన సామర్థ్యం తగ్గే అవకాశం
పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కూడా E20 అమలును దశలవారీగా చేపట్టాలని స్పష్టం చేసింది. దీనర్థం దేశంలోని వాహన తయారీరంగం, ఇంధన పంపిణీ వ్యవస్థ, వినియోగదారులు అందరూ ఒకేసారి ఈ మార్పుకు సిద్ధంగా లేరని విధాన రూపకర్తలే గుర్తించినట్లు అవుతోంది. ఒక ప్రజా విధానం విజయవంతం కావాలంటే దాని లాభాలతో పాటు పరిమితులను కూడా ప్రజలకు సమానంగా వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఈ చర్చలో అత్యంత కీలకమైన అంశం ఇంధన సామర్థ్యం.
పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో శక్తి సాంద్రత తక్కువగా ఉంటుంది. అందువల్ల E20 కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేయని కొన్ని వాహనాల్లో ఇంధన సామర్థ్యం సుమారు 4 నుంచి 7 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని నీతి ఆయోగ్ రోడ్‌మ్యాప్ పేర్కొంది. దీని అర్థం ప్రతి వాహనంలో ఒకే విధమైన ప్రభావం ఉంటుందనేది కాదు. కానీ వినియోగదారుడు అదే దూరం ప్రయాణించడానికి కొంత ఎక్కువ ఇంధనం వినియోగించాల్సి వచ్చే అవకాశం ఉందని ఇది సూచిస్తోంది.
ప్రజలపై ఆర్థిక భారం
ఇక్కడే అత్యంత ముఖ్యమైన విధానపరమైన ప్రశ్న తలెత్తుతోంది. దేశానికి చమురు దిగుమతుల వ్యయం తగ్గితే అది జాతీయ స్థాయిలో లాభమే. కానీ అదే సమయంలో సాధారణ వాహనదారుడు ప్రతి నెలా అదనంగా ఇంధనం కొనుగోలు చేయాల్సి వస్తే, దేశానికి కలిగే లాభం, ప్రజలకు పడే భారం మధ్య ప్రభుత్వం సమగ్ర విశ్లేషణ చేసి ప్రజల ముందుంచిందా? ఒక సంస్కరణ విజయాన్ని ప్రభుత్వ ఖాతాల్లో కనిపించే ఆదాతో మాత్రమే కాదు. ప్రజల జేబుపై పడే ప్రభావంతో కూడా కొలవాలి.
అందుకే E20పై చర్చను కేవలం దేశ ప్రయోజనం అనే ఒక్క కోణంలో చూడటం సరిపోదు. వాహనాల సాంకేతిక అనుకూలత, వినియోగదారుల వ్యయం, సహజ వనరుల వినియోగం, వ్యవసాయంపై ప్రభావం, పర్యావరణ సమతుల్యత వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించినప్పుడే ఈ విధానం నిజమైన ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు.
కోట్లాది పాత వాహనాల సంగతేంటి?
ఈ నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యం పొందుతున్న అంశం ఇథనాల్‌కు ఉన్న హైగ్రోస్కోపిక్ స్వభావం. ఇథనాల్ గాలిలోని తేమను ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటుంది. అధిక తేమ ఉన్న ప్రాంతాల్లో లేదా ఎక్కువకాలం నిల్వ చేసిన ఇంధనంలో ఫేజ్ సెపరేషన్ జరిగే అవకాశం ఉందని సాంకేతిక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంధన నాణ్యత దెబ్బతినడమే కాకుండా, E20కు ప్రత్యేకంగా రూపకల్పన చేయని కొన్ని పాత వాహనాల్లో ఫ్యూయల్ ఫిల్టర్లు, ఇంజెక్టర్లు, పంపులు, రబ్బరు సీల్స్ వంటి భాగాల పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ఆధునిక E20- అనుకూల వాహనాల్లో ఈ సమస్యలను తగ్గించే సాంకేతిక మార్పులు ఉన్నప్పటికీ, ప్రస్తుతం రోడ్లపై ఉన్న కోట్లాది పాత వాహనాల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన సాంకేతిక మార్గదర్శకాలు, వినియోగదారుల అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
నిర్వహణ వ్యయం పెరిగితే దాని ప్రభావం అత్యధికంగా ఆటోరిక్షా డ్రైవర్లు, టాక్సీ నిర్వాహకులు, డెలివరీ సేవలు, చిన్న వ్యాపారులు, రైతులు, గ్రామీణ ప్రాంతాల్లో పాత వాహనాలను ఉపయోగించే
కుటుంబాలపై పడుతుంది.
జల భద్రతపై ప్రభావం
ప్రస్తుతం భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న ఇథనాల్‌లో ప్రధాన భాగం చెరకు, దాని ఉప ఉత్పత్తుల నుంచే వస్తోంది. అయితే చెరకు ప్రపంచంలో అత్యధిక నీటిని వినియోగించే వాణిజ్య పంటలలో ఒకటి. నివేదికలు ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాల మట్టం పడిపోతున్నట్లు హెచ్చరిస్తున్నాయి. నీటి సంరక్షణను జాతీయ ప్రాధాన్య అంశంగా ప్రకటిస్తున్న ప్రభుత్వం, ఇథనాల్ ఉత్పత్తి కోసం అధిక నీటి అవసరం ఉన్న పంటలపై ఆధారపడటం దీర్ఘకాలంలో జల భద్రతపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాన్ని స్పష్టంగా వివరించాల్సిన అవసరం ఉంది.
చెరకు సాగు ప్రధానంగా కొన్ని రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉంది. దేశంలోని చిన్న, సన్నకారు రైతులలో అత్యధికులు వర్షాధారిత వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. రైతుల సంక్షేమం నిజంగా ప్రభుత్వ లక్ష్యమైతే, చెరకు ఆధారిత ఇథనాల్‌కే పరిమితం కాకుండా వ్యవసాయ వ్యర్థాలు, రెండో తరం (2జీ) బయోఫ్యూయల్స్, తక్కువ నీటి అవసరం ఉన్న ప్రత్యామ్నాయ ముడి పదార్థాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.
E20పై కేంద్రం స్పష్టత ఇవ్వాలి
కేంద్ర ప్రభుత్వం E20పై సమాధానం ఇవ్వాల్సిన కొన్ని ప్రశ్నలు ఇప్పటికీ మిగిలే ఉన్నాయి. భూగర్భ జలాలపై ప్రభావాన్ని నిరంతరం సమీక్షిస్తుందా? చెరకు ఆధారిత ఇథనాల్‌తో పాటు 2జీ బయోఫ్యూయల్స్‌కు మరింత ప్రాధాన్యం ఇస్తుందా? ఇంధన విధానాన్ని నీటి భద్రత, ఆహార భద్రత, వినియోగదారుల ప్రయోజనాలతో సమతుల్యం చేసే దీర్ఘకాల వ్యూహాన్ని రూపొందిస్తుందా? ఈ ప్రశ్నలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి కాదు.
ప్రభుత్వ విధానాన్ని మరింత బాధ్యతాయుతంగా, శాస్త్రీయంగా, ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా మార్చడానికి అవసరమైన ప్రశ్నలు. భారతదేశానికి ప్రత్యామ్నాయ ఇంధన విధానం అవసరం అనేది సందేహానికి తావులేని విషయం. అయితే ఇంధన స్వావలంబనను సాధించే క్రమంలో జల భద్రత, ఆహార భద్రత, రైతుల సంక్షేమం, వినియోగదారుల హక్కులు, పర్యావరణ సమతుల్యతలను కూడా సమానంగా కాపాడగలిగితేనే E20 నిజమైన జాతీయ విజయంగా నిలుస్తుంది.
- భరత్ చౌహాన్, హెచ్‌సీయూ-
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీopenpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
