జులై 9 ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం.. విద్యార్థి చైతన్యానికి.. నిరంతర ప్రస్థానం

జులై 9  ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం.. విద్యార్థి చైతన్యానికి.. నిరంతర ప్రస్థానం
  • 2026 జులై 9  ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవం

భారత విద్యార్థి ఉద్యమ చరిత్రలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) విశిష్ట స్థానాన్ని అధిష్టించిన సంస్థగా తనకంటూ ఒక అపూర్వ అధ్యాయాన్ని లిఖించుకుంది. 1949 జులై 9న  స్వాతంత్ర్యానంతర భారతదేశం తన జాతీయ పునర్నిర్మాణ యాత్రను  ప్రారంభించిన తొలిదశలో ఆవిర్భవించిన ఏబీవీపీ నేడు 78వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆచరిస్తున్నది. 

 ఇది ఒక విద్యార్థి సంఘం వార్షికోత్సవం మాత్రమే కాదు భారతీయ విద్యార్థి చైతన్యానికి, జాతీయ స్వాభిమానానికి, సేవా సంప్రదాయానికి,  నాయకత్వ వికాసానికి సంబంధించిన ఒక సజీవ చరిత్ర. ‘జ్ఞానం, శీలం, ఏకత’ ఈ మూడు పదాలు కేవలం ఒక నినాదం కాదు.  భారతీయ విద్యార్థి జీవితానికి ఏబీవీపీ నిర్దేశించిన తాత్త్విక త్రివేణి.  

జ్ఞానం వ్యక్తిత్వానికి  ప్రకాశం.  శీలం సమాజానికి విశ్వాసం.  ఏకత దేశానికి శాశ్వత శక్తి.  ఈ  త్రిసూత్రాన్ని కార్యరూపంలో ఆవిష్కరించడమే ఏబీవీపీ ఏడు దశాబ్దాలకుపైగా  సాగించిన  నిరంతర సాధన. బంగ్లాదేశ్  చొరబాబుదారులను అరికట్టాలని చలో చికెన్  నెక్‌కి పిలుపునిచ్చి, సేవ్  అస్సాం టుడే  టు సేవ్ ఇండియా టుమారో అని నినదిస్తూ.. అక్రమ వలసదారులని వెనక్కి పంపించాలని, ఆర్టికల్ 370,  ఎన్‌‌‌‌ఈపీ ఇలాంటివి ఎన్నో ఏబీవీపీ చేసిన ఉద్యమాల ఫలితాలను నేడు చూడగలుగుతున్నాం.  అత్యంత  సంక్లిష్ట ఘట్టమైన 1975 అత్యవసర పరిస్థితి సమయంలో వేలాదిమంది కార్యకర్తలు నిర్బంధాలను ఎదుర్కొంటూ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు నిలబడిన సందర్భం విద్యార్థి పరిషత్ చరిత్రలో విశిష్ట అధ్యాయం.

ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఏబీవీపీ 

ప్రపంచంలో అనేక విద్యార్థి సంఘాలు ఉన్నాయి, అయితే ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఏబీవీపీ ఎదగడం కేవలం సభ్యత్వ గణాంకాల ఫలితం కాదు. అది కార్యకర్తల జీవన విలువల సమాహారం. వ్యక్తి నిర్మాణం ద్వారానే దేశ పునర్నిర్మాణం సాధ్యమని నమ్మి విద్యార్థి పరిషత్ ఎంతోమంది యువతని నాయకులుగా, ఉత్తమ పౌరులుగా మలిచి దేశానికి అందించింది. 

విద్యార్థి పరిషత్ కార్యకర్తల బలిదానాలు నేటి యువతకి స్ఫూర్తి.  తెలంగాణ నేల ఈ సందర్భంలో ఒక గర్వకారణాన్ని గుర్తు చేస్తుంది.  విద్యార్థి హక్కులు, జాతీయ చైతన్యం,  ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాడుతూ ముప్పైమూడు మంది  ఏబీవీపీ కార్యకర్తలు అమరులయ్యారు. ఒక సంస్థ సిద్ధాంతాన్ని గ్రంథాలు మాత్రమే నిలబెట్టవు, త్యాగాలు దానిని శాశ్వతం చేస్తాయి. 

ట్రాన్స్‌‌‌‌ఫర్మేషన్ ఆఫ్ ఏబీవీపీ

కాలప్రవాహం మారింది.  ప్రపంచీకరణ, సాంకేతిక విప్లవం, కృత్రిమ మేధస్సు, వాతావరణ మార్పులు, జీవనశైలిలో పరివర్తన ఇవన్నీ నేటి విద్యార్థి ప్రపంచాన్ని కొత్త ప్రశ్నల ముందు నిలబెట్టాయి.  కాలానుగుణ పరివర్తనను స్వీకరించని  సంస్థలు చరిత్రలో నిలవలేవు. ఈ సత్యాన్ని గ్రహించిన ఏబీవీపీ తన ఉద్యమాన్ని విస్తృత జీవనోద్యమంగా రూపాంతరం చేసింది. 

ఈ పరిణామానికి ప్రతిరూపమే ఏబీవీపీ ఆయామ-గతివిధి భావన.  ఖేలో భారత్ ద్వారా శారీరక దారుఢ్యం,  క్రీడాస్ఫూర్తి వికాస సంకల్పంగా,  రాష్ట్రీయ కళా మంచ్ - భారతీయ కళ,  సాహిత్య,  సంగీత, నాట్య, సాంస్కృతిక సంపదను యువతతో  అనుసంధానించడం,  స్టూడెంట్స్ ఫర్ డెవలప్‌‌‌‌మెంట్ ద్వారా పర్యావరణ పరిరక్షణ, వాతావరణ  మార్పులపై అవగాహన,  జీవవైవిధ్య సంరక్షణ,  సుస్థిర అభివృద్ధి వంటి ప్రపంచవ్యాప్త అంశాల్లో విద్యార్థి సమాజాన్ని భాగస్వామిగా చేయడం విశేషం.  

 ఈ ఏడు దశాబ్దాల  ప్రస్థానం  మనకు ఒక గంభీరమైన సందేశాన్ని అందిస్తుంది. ఉద్యమం అనేది కేవలం వీధుల్లో నినాదాలు చేయడం కాదు.  అది సమాజంలో విలువలను ప్రతిష్ఠించే నిరంతర సాధన.  78 సంవత్సరాల ఈ ప్రస్థానాన్ని స్మరించుకునే ఈ సందర్భంలో  గతాన్ని గౌరవించడం మాత్రమే కాదు,  భవిష్యత్తుపై బాధ్యతను మరింతగా ఆచరించడం అవసరం. - 

మడూరి సందీప్ రావు, 
ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్,
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీopenpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.