ఈట్ రైట్ ఇండియా వైపు అడుగులు సాధ్యమేనా? కార్పొరేట్ శకంలో హోటళ్ల వైఫల్యం

ఈట్ రైట్ ఇండియా వైపు అడుగులు సాధ్యమేనా? కార్పొరేట్ శకంలో హోటళ్ల వైఫల్యం

భారతీయ  జీవనశైలి ఆహారానికి అత్యున్నత స్థానం కల్పిస్తుంది.  అతిథిని  దైవంగా భావించే సంస్కృతి మనది.  పూర్వకాలంలో హోటల్  నిర్వహణ  కేవలం ఉపాధి మార్గం మాత్రమే కాకుండా,  సామాజిక సేవగా పరిగణించేవారు. అప్పట్లో  యజమానులు వంటగదిని  పవిత్రమైన స్థలంగా భావించేవారు. తాము తయారుచేసే ఆహారాన్ని తమ కుటుంబ సభ్యులకు వడ్డిస్తున్నామనే స్పృహ వారిలోఉండేది.  

పదార్థాల స్వచ్ఛత,  ఆహారం వండడంలో నిబద్ధత అప్పటి వ్యాపార లక్షణాలు.  ఆకర్షణీయమైన ప్రకటనలు లేకుండానే కేవలం నోటిమాట ద్వారా ఆ హోటళ్ల కీర్తి వ్యాపించేది.  అప్పటి వ్యాపారవేత్తలు లాభాల కంటే కస్టమర్ సంతృప్తికి,  ఆరోగ్యానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చేవారు. నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది.  అసలు లక్ష్యం కేవలం వ్యాపార లాభం మాత్రమే.

ప్రముఖ హోటళ్ల వైఫల్యం

అప్పట్లో  హోటల్ నడిపేవారు లాభం కోసం కాకుండా,  ఆకలితో  వచ్చినవారికి  తృప్తిగా పెట్టాలనే సేవా భావంతో  పనిచేసేవారు.  నాణ్యమైన నెయ్యి,  నూనెలు, తాజా కూరగాయలు వాడేవారు. రసాయనాలు లేదా కృత్రిమ రంగుల వాడకం ఉండేది కాదు.  కాల ప్రవాహంలో ఆహార వ్యాపారం స్వరూపం పూర్తిగా మారింది.  ప్రస్తుత కార్పొరేట్ శకంలో లాభం అనే అంశమే సర్వోన్నతమైంది.  

విపరీతమైన పోటీ,  ఆకాశాన్ని తాకుతున్న అద్దెలు, పెరుగుతున్న సిబ్బంది  ఖర్చులు  యజమానులను  ఒత్తిడికి  గురిచేస్తున్నాయి. ఈ పోటీని  తట్టుకోవడానికి,  తక్కువ పెట్టుబడితో  గరిష్ట లాభాలను పొందాలనే ఆశతో వ్యాపారులు కనీస ధర్మాలను విస్మరిస్తున్నారు.  ఇక్కడ  ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే,  ఈ  అపరిశుభ్రత  కేవలం చిన్న తినుబండారాలకే  పరిమితం కాలేదు. నగరంలో పేరున్న,  విలాసవంతమైన  రెస్టారెంట్లు సైతం ఇదేదారిలో  పయనిస్తున్నాయి. 

 ఇటీవల ఆహార భద్రతా విభాగం జరిపిన ఆకస్మిక తనిఖీలలో  వెలుగు చూసిన వాస్తవాలు దిగ్భ్రాంతికి  గురిచేస్తున్నాయి.  బ్రాండ్ పేరు చూసి వెళ్లే  కస్టమర్లు మోసపోతున్నారు.  తనిఖీలలో  వెలుగు చూస్తున్న నిజాలు చూస్తుంటే,  ప్రముఖ రెస్టారెంట్లలో కనీస పరిశుభ్రత లేకపోవడం  అత్యంత  బాధాకరం.  గడువు ముగిసిన నిల్వ పదార్థాలు, బూజు పట్టిన వంటకాలు, ఎలుకలు, బొద్దింకల సంచారం  ప్రతిచోటా కనిపిస్తున్నాయి. 

పేరున్న హోటళ్లు, చిన్న హోటళ్లనే తేడా లేకుండా అందరూ లాభాలే ధ్యేయంగా పనిచేస్తున్నారు.  నాణ్యతలేని వస్తువుల వినియోగం,  పరిశుభ్రత పట్ల  నిర్లక్ష్యం ప్రదర్శించుట  నేడు  సాధారణమైపోయాయి.  కస్టమర్  ఒక  ఆరోగ్యకరమైన భోజనాన్ని ఆశించే వ్యక్తిగా  కాకుండా, కేవలం ఆదాయాన్ని తెచ్చే వనరుగా మాత్రమే మారుతున్నాడు.  బాధ్యతారాహిత్యం పెరగడంవల్ల  నైతికత  అడుగంటింది.

మసకబారిన పారదర్శకత

ఆహారం ఆకర్షణీయంగా,  రుచిగా కనిపించడానికి టేస్టింగ్ సాల్ట్స్ (అజినోమోటో),  హానికరమైన ఫుడ్ కలర్స్,  ప్రిజర్వేటివ్స్ విచ్చలవిడిగా వాడుతున్నారు. ఇది కస్టమర్ల  ఆరోగ్యం కంటే  కేవలం వ్యాపార లాభాల కోసమే. సోషల్ మీడియా  ఇన్‌‌‌‌ఫ్లూయన్సర్లు,  మెరిసే లైట్లు,  అందమైన  ఇంటీరియర్స్‌‌‌‌తో  భారీగా ప్రకటనలు ఇస్తారు.  కానీ,  ఆహార నాణ్యతలో మాత్రం రాజీపడుతుంటారు.  

నేడు హోటల్ రంగం ఒక సేవ కాదు, అదొక పక్కా కమర్షియల్ బిజినెస్. కస్టమర్  ప్లేట్‌‌‌‌లో  ఏంతింటున్నారనే దానికంటే,  కౌంటర్‌‌‌‌లో  ఎంత బిల్లు కడుతున్నారనేదే ముఖ్యం.  సాంకేతిక పరిజ్ఞానం,  ఆన్‌‌‌‌లైన్  డెలివరీ అప్లికేషన్లు ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి.  ఇవి కస్టమర్లకు సౌకర్యాన్ని  అందించిన మాట వాస్తవం.  అయితే, ఇవి రెస్టారెంట్లకు, వినియోగదారులకు మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని తెంచేశాయి.  

ఈ  డిజిటల్ యుగంలో 'క్లౌడ్ కిచెన్లు' అనే వంటశాలలు పుట్టుకొచ్చాయి. వీటిలో చాలావరకు ఎటువంటి  పర్యవేక్షణ లేని,  మూసివున్న గదుల్లో  అపరిశుభ్రమైన పరిస్థితుల్లో నడుస్తున్నాయి.  ఆహారం ఎక్కడ తయారవుతుందో,  ఏ వాతా వరణంలో వండుతున్నారో కస్టమర్‌‌‌‌కు తెలియదు. 

కలుషిత ఆహారంతో అనర్థాలు 

కేవలం అప్లికేషన్లలోని రేటింగ్స్, ఆకర్షణీయమైన ఫొటోలను చూసి కస్టమర్లు మోసపోతున్నారు. అపరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలు అనంతం. కలుషిత ఆహారం వల్ల విరేచనాలు, వాంతులు, టైఫాయిడ్ వంటి వ్యాధులు తక్షణమే సోకుతాయి.  గడువు  ముగిసిన నిల్వ పదార్థాలు, నాణ్యత లేని నూనెల వల్ల కాలేయ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు దీర్ఘకాలంలో వేధిస్తాయి. 

ఆహార పదార్థాల్లో కలిపే రసాయనాలు, కృత్రిమ రంగులు శరీర రోగ నిరోధక శక్తిని తగ్గిస్తాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు సైతం ఇవి దారితీసే ప్రమాదం ఉంది. చిన్నారులు, వృద్ధులు ఈ అనారోగ్య సమస్యలకు త్వరగా గురవుతారు. ఆహార భద్రతా ప్రమాణాలు  పాటించకపోవడం అంటే  ప్రజల ప్రాణాలతో  చెలగాటం ఆడటమే. ఆధునిక ఆహార సంస్కృతిలో దాగివున్న  ఈ ప్రమాదకరమైన కోణాలను ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది.  కేవలం రుచి చూసి మోసపోకుండా, ఆరోగ్యం పట్ల స్పృహ కలిగి ఉండటం నేటి తక్షణ అవసరం.

'ఈట్ రైట్ ఇండియా' ఉద్యమం

'ఈట్ రైట్ ఇండియా' అనేది దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ‘భారత ఆహార భద్రత & ప్రమాణాల ప్రాధికార సంస్థ’ ( ఎఫ్‌‌‌‌ఎస్ఎస్‌‌‌‌ఏఐ)  ప్రారంభించిన  ఒక  ప్రతిష్టాత్మక జాతీయ ఉద్యమం.  దేశంలోని ఆహార వ్యవస్థను  పూర్తిగా మార్చడం,  ప్రజలకు సురక్షితమైన, పోషక విలువలు గల ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేసే సంస్థ,  సమాజంలోని అన్ని వర్గాలకు చేరడానికి వివిధ రకాల సర్టిఫికేషన్లను ప్రవేశపెట్టింది.  

ఇందులో భాగంగా, పాఠశాల స్థాయి నుంచే పిల్లల్లో మంచి ఆహార అలవాట్లు, పోషకాహారంపై అవగాహన పెంచడానికి 'ఈట్ రైట్ స్కూల్' కార్యక్రమాన్ని తెచ్చింది.  అలాగే ఐటీ కంపెనీలు, విశ్వవిద్యాలయాలు,  ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, జైళ్లలోని క్యాంటీన్లలో  నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేలా 'ఈట్ రైట్ క్యాంపస్' ద్వారా ధృవీకరణ ఇస్తోంది.  

ప్రయాణికులకు లభించే ఆహారం అత్యంత పరిశుభ్రంగా  ఉండేలా రైల్వే స్టేషన్లను తనిఖీ చేసి 'ఈట్ రైట్ స్టేషన్' సర్టిఫికెట్ ఇస్తుండగా,  ముంబై సెంట్రల్ దేశంలోనే  మొదటి స్టేషన్‌‌‌‌గా నిలిచింది.  వీధుల్లో బండ్లపై  దొరికే  స్ట్రీట్ ఫుడ్ కూడా శుభ్రమైన వాతావరణంలో లభించేలా 'క్లీన్ స్ట్రీట్ ఫుడ్ హబ్' ద్వారా చిన్న వ్యాపారులకు శిక్షణ ఇస్తున్నారు.  అంతేకాకుండా హోటళ్లలో ఒకసారి వాడిన వంట నూనెను మళ్లీ మళ్లీ వాడకుండా సేకరించి బయోడీజిల్‌‌‌‌గా మార్చే వినూత్నమైన 'రుకో'  కార్యక్రమాన్ని కూడా ఎఫ్‌‌‌‌ఎస్ఎస్‌‌‌‌ఏఐ విజయవంతంగా నడుపుతోంది.

బాధ్యతాయుత మార్పు

ఈ సంక్షోభం నుంచి  బయటపడాలంటే సమగ్ర మార్పు అవసరం.  చట్టం మరింత కఠినతరం కావాలి.  నిబంధనలు ఉల్లంఘించే హోటళ్లపై కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా,  లైసెన్సులను రద్దుచేసే స్థాయికి శిక్షలు ఉండాలి. ప్రతి రెస్టారెంట్ తన కిచెన్‌‌‌‌ను నిరంతరం పర్యవేక్షించేలా,  కస్టమర్లు కూడా ఆ వాతావరణాన్ని చూసేలా సాంకేతికతను ప్రోత్సహించాలి. 

 అపరిశుభ్రంగా ఉన్న వ్యాపారసంస్థలను బహిరంగంగా ప్రకటిస్తూ ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి.  రెస్టారెంట్ నిర్వాహకులు తమ లాభాల కంటే  ముందు  కస్టమర్ ఆరోగ్యం, నమ్మకాన్ని ఉంచాలి.  పర్యావరణం, పరిశుభ్రత విషయంలో సిబ్బందికి నిరంతరం శిక్షణ ఇవ్వాలి.  కస్టమర్లుగా మనం కూడా మారాలి.  చౌక ధరలకో,  ఆకర్షణీయమైన ప్రకటనలకో  ముగ్ధులవ్వకూడదు.  ఎక్కడైనా  అపరిశుభ్రత  కనిపిస్తే  వెంటనే ప్రశ్నించాలి. ఫిర్యాదు చేయాలి. మనం మౌనంగా ఉంటే వ్యాపారుల నిర్లక్ష్యం పెరిగిపోతుంది.

- డా. కట్కూరి, పాలసీ ఎనలిస్ట్​-

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీopenpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.