పద్మారావునగర్, వెలుగు: నకిలీ పత్రాలు సృష్టించి వృద్ధురాలి ఆస్తిని కాజేయడానికి యత్నించిన కేసులో ఓ నిందితుడిని చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. సీతాఫల్‌మండి మేడిబావికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ టీచర్ ఎస్.వి.సులోచన వాసుదేవన్(82) ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్నారు.
ఆమెకు హైదరాబాద్లో ఇల్లు ఉంది. ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న అల్లబోయిన పద్మావతి ఇతరులతో కలిసి 2017 బ్యాక్‌డేట్‌తో నకిలీ అమ్మకపు ఒప్పంద పత్రాన్ని సృష్టించింది. దీన్ని అడ్డం పెట్టుకుని సులోచనను ఇంట్లోకి రాకుండా బెదిరించింది.
ఈ ఘటనపై 2024లో చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా నకిలీ ఒప్పంద పత్రంపై సాక్షిగా సంతకం చేసిన ప్రధాన నిందితురాలి సోదరుడు రాజం ఇలేష్ యాదవ్(61)ను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చెల్లెలి అభ్యర్థన మేరకే సాక్షిగా సంతకం చేసినట్లు అతడు అంగీకరించడంతో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
