హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల ఆధార్ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్ ప్రక్రియను వేగవంతం చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, ఇంటర్మీడియెట్ కాలేజీలు సహకరించాలని స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, యూఐడీఏఐ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
క్షేత్రస్థాయిలో ఆధార్ అప్‌డేట్ చేస్తున్న ఆపరేటర్లను కొన్ని ప్రైవేటు స్కూళ్లు, ఇంటర్ కాలేజీలు లోపలికి అనుమతించడం లేదని విద్యాశాఖ దృష్టికి వచ్చింది. దీనిపై డైరెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధార్ రికార్డులను సక్రమంగా నిర్వహించడానికి, విద్యార్థులకు అందాల్సిన వివిధ సేవలకు బయోమెట్రిక్ అప్‌డేట్ ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
