బడుల్లో టీచర్ల సర్దుబాటుకు గ్రీన్ సిగ్నల్

బడుల్లో టీచర్ల సర్దుబాటుకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో. టీచర్ల కొరతను తీర్చి, విద్యాబోధన నిరంతరాయంగా సాగేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. జిల్లాల్లో అవసరానికి మించి అదనంగా ఉన్న టీచర్లను, ఉపాధ్యాయులు లేని బడులకు సర్దుబాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు కొనసాగింపుగా వెంటనే ఈ ప్రక్రియను చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.

రిటైర్మెంట్లు, దీర్ఘకాలిక సెలవులు, ప్రమోషన్లు లేదా ఇతర పరిపాలనా కారణాలతో బడుల్లో ఏర్పడిన ఖాళీలను గుర్తించి, అక్కడ అదనపు టీచర్లను నియమించాలని డైరెక్టర్ సూచించారు. అయితే, ఈ సర్దుబాటు ప్రక్రియను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆమోదంతోనే చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ఏ స్కూల్లో ఎంత మంది విద్యార్థులు ఉన్నారనే అంశాన్నీ ప్రాతిపదికగా తీసుకుని, జీవో నెం.25 నిబంధనలకు అనుగుణంగా సబ్జెక్టుల వారీగా అవసరమైన టీచర్లను కేటాయించాలని ఆదేశించారు.ఈ వర్క్ అడ్జస్ట్‌మెంట్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, త్వరితగతిన పూర్తి చేసి నివేదిక సమర్పించాలని డీఈవోలను కోరారు.