ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీ.. ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు.. 3 రోజుల పర్యటన

ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీ.. ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు.. 3 రోజుల పర్యటన
  • ద్వైపాక్షిక సదస్సుకు హాజరు
  • మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌లో భారీ కమ్యూనిటీ ఈవెంట్​
  • నిరసన తెలిపిన మానవ హక్కుల సంఘాలు, ముస్లిం మైనారిటీ సంస్థలు
  • భద్రత కట్టుదిట్టం చేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం


మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్: ఇండోనేసియా పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి నుంచి 3 రోజుల టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. బుధవారం ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌లో ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఈ నెల 8 నుంచి 10 వరకు జరిగే ‘ఆస్ట్రేలియా- ఇండియా వార్షిక నేతల శిఖరాగ్ర సదస్సు’లో మోదీ పాల్గొననున్నారు. ఈ సమావేశాల్లో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్యం, విద్య, క్లీన్ ఎనర్జీ, క్రిటికల్ మినరల్స్ లాంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.

దశాబ్దం తర్వాత ఆయన మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్ నగరానికి వస్తుండటంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో మోదీ పర్యటన సందర్భంగా మానవ హక్కుల సంఘాలు, ముస్లిం మైనారిటీ సంస్థలు నిరసనలకు పిలుపునిచ్చాయి. అంతర్జాతీయ హక్కుల సంస్థ ‘అమ్నెస్టీ ఇంటర్నేషనల్’  మానవ హక్కుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. భారత్‌‌‌‌‌‌‌‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు, మైనారిటీలపై జరుగుతున్న వివక్షను ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ ద్వైపాక్షిక చర్చల్లో ప్రస్తావించాలని డిమాండ్ చేసింది.

జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు ఎలాంటి భయాందోళనలు లేకుండా పనిచేసే వాతావరణాన్ని కల్పించేలా భారత్‌‌‌‌‌‌‌‌ను ప్రోత్సహించాలని కోరింది. అలాగే,  మోదీ పర్యటనకు వ్యతిరేకంగా గురువారం సాయంత్రం నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్టు ‘అలయన్స్ ఎగైనెస్ట్ ఇస్లామోఫోబియా’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది. భారత్‌‌‌‌‌‌‌‌లో ముస్లింలపై పెరుగుతున్న ద్వేషం, కుల వివక్ష, హక్కుల అణచివేతకు వ్యతిరేకంగా వీధుల్లోకి వస్తామని తెలిపింది.

కట్టుదిట్టమైన భద్రత..  

మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌లోని ప్రసిద్ధ ‘మార్వెల్ స్టేడియం’లో ప్రధాని మోదీ గౌరవార్థం భారీ కమ్యూనిటీ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ను నిర్వహిస్తున్నారు. ‘ఆస్ట్రేలియా–ఇండియా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉచిత కార్యక్రమానికి దాదాపు 25 – 30 వేల  మంది ప్రవాస భారతీయులు  హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. భారత్- –ఆస్ట్రేలియా విజయగాథకు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రతీకగా ఈ వేడుకను నిర్వహిస్తున్నట్టు ఫౌండేషన్ ప్రతినిధి ప్రణవ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శనలు కూడా జరగనున్నాయి. కాగా, ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఆస్ట్రేలియాలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

మోదీకి ముప్పు తలపెట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఒక యువకుడిని ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు ముందస్తుగా హెచ్చరించారు. నిరసనల నేపథ్యంలో విక్టోరియా పోలీసులు స్పందిస్తూ.. భద్రతా కారణాల దృష్ట్యా వ్యూహాత్మక వివరాలను వెల్లడించలేమని, అయితే పర్యటన ప్రశాంతంగా సాగేందుకు అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. 

ఇండోనేసియాలో చారిత్రక ఆలయ సందర్శన

ఇండోనేసియా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు  ప్రబోవో సుబియాంతో కలిసి మోదీ బుధవారం యోగ్యకర్త ప్రాంతంలోని వెయ్యేండ్ల క్రితం నాటి చారిత్రక ప్రంబనన్‌‌‌‌‌‌‌‌ ఆలయ సముదాయాన్ని సందర్శించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ ఆలయ పునరుద్ధరణ, పరిరక్షణ కోసం ఇరు దేశాల ఉమ్మడి ప్రాజెక్టును ఇద్దరూ కలిసి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేక ఫలకాన్ని ఆవిష్కరించారు. భారత్, ఇండోనేసియాల మధ్య శతాబ్దాలుగా ఉన్న బలమైన సాంస్కృతిక, నాగరికత సంబంధాలకు ఈ ఉమ్మడి ప్రాజెక్టు 
ఒక నిదర్శనం అని ప్రధాని మోదీ తెలిపారు.