- స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌పై 15 ఏండ్ల బాలుడి సైబర్ దాడి
- జపాన్‌లో ఘటన.. పోలీసుల అదుపులో బాలుడు
టోక్యో: జపాన్‌కు చెందిన హైస్కూల్ విద్యార్థి బాండాయ్ నామ్కో(15) ఫిల్మ్‌వర్క్స్ సంస్థకు చెందిన 'బాండాయ్ ఛానల్(జపనీస్ యానిమేషన్ కంటెంట్)' అనే యానిమే స్ట్రీమింగ్ సర్వీస్‌పై సైబర్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడికి అతడు చాట్‌జీపీటీ టెక్నాలజీని ఉపయోగించుకున్నాడు. దాంతో సర్వర్ తీవ్రంగా దెబ్బతిని.. ఏకంగా 46,000 కంటే ఎక్కువ మంది కస్టమర్ల అకౌంట్లు డిలీట్ అయ్యాయి. సంస్థ ఫిర్యాదు మేరకు ఘటనపై విచారణ చేపట్టిన టోక్యో మెట్రోపాలిటన్ పోలీసులు.. సదరు బాలుడిని అరెస్ట్ చేశారు. ప్రైమరీ స్కూల్ నుంచే సొంతంగా ప్రోగ్రామింగ్ నేర్చుకున్న బాలుడు.. గతంలో కూడా కొన్ని కంప్యూటర్ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.
సైబర్ ఎటాక్ ఎలా చేశాడంటే..!
వాస్తవానికి ఈ సైబర్ దాడి 2025 నవంబర్ నెలలో జరిగింది. 'బాండాయ్ ఛానల్' అనేది నెట్‌ఫ్లిక్స్, హాట్స్టార్లాగా పనిచేసే యానిమేషన్ సినిమాల స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్. ఇందులో జనాలు డబ్బులు కట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటారు. తమకు అకౌంట్ వద్దు అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. దీన్ని గుర్తించిన బాలుడు.. ప్లాట్‌ఫామ్‌లో ఒకరి తర్వాత ఒకరి అకౌంట్‌ను డిలీట్ చేసుకుంటూ పోయేలా ఒక చిన్న కంప్యూటర్ ప్రోగ్రామ్(కోడ్) రాశాడు. అయితే, ఆ ప్రక్రియ చాలా ఎక్కువ సమయం తీసుకుంటుండటంతో చాట్‌జీపీటీ సహాయం తీసుకున్నాడు. దాంతో చాట్‌జీపీటీ కోడ్‌ను చాలా వేగంగా పనిచేసేలా వేరే ప్రోగ్రామింగ్ భాషలోకి మార్చి ఇచ్చింది. ఈ కోడ్‌తో 2 రోజుల్లోనే ఆ బాలుడు 46,812 మంది కస్టమర్ల ఖాతాలను డిలీట్ చేశాడు.
