ఒట్టావా, లాస్ఏంజెల్స్: ఖలిస్థానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని కెనడా రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్(ఆర్‌సీఎంపీ) స్పష్టం చేసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటివరకు భారత ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉన్నట్లు ఎటువంటి సాక్ష్యాలు బయటపడలేదని ఆర్‌సీఎంపీ డిప్యూటీ కమిషనర్ లీసా మోర్‌లాండ్ బుధవారం స్పష్టం చేశారు. కేసు దర్యాప్తు మాత్రం కొనసాగుతోందని, భారత ప్రభుత్వం సహకరిస్తోందని ఆమె వెల్లడించారు.
2023లో అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పార్లమెంట్‌లో మాట్లాడుతూ, నిజ్జర్ హత్య వెనుక ఇండియన్ ఏజెంట్లకు సంబంధం ఉందని ఆరోపించారు. ఈ కామెంట్లు భారత్=-కెనడా ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలకు దారితీశాయి. తాజాగా అమెరికా న్యాయశాఖ ఈ కేసుకు సంబంధించి అభియోగపత్రాలను బయటపెట్టింది. గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, ఉత్తర అమెరికాలో అతని అనుచరుడు గోల్డీ బ్రార్‌తో కలిసి నిజ్జర్ హత్యకు కుట్ర పన్నినట్లు అభియోగాలు మోపింది. ఇందులో భారత ప్రభుత్వ పాత్ర గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు.
లారెన్స్ బిష్ణోయ్‌పై అమెరికాలో కేసు
కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని అనుచరుడు గోల్డీ బ్రార్‌పై అమెరికాలో కేసు నమోదైంది. బిష్ణోయ్ జైలులో నుంచే హత్యకు ఆదేశాలు ఇచ్చాడని అమెరికా దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. పరారీలో ఉన్న గోల్డీ బ్రార్ ఆచూకీ తెలిపితే ఫెడరల్బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) 50 వేల డాలర్ల బహుమతి ప్రకటించింది.
