పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం ఎంత తీవ్రంగా మారిందో చెప్పడానికి ప్రస్తుత పరిస్థితులే ఉదాహరణ. అక్కడ ప్రజలకు బతకడమే కాదు.. చనిపోవడం కూడా భారంగా మారింది. ఒకప్పుడు కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు కలిసి చివరి సంస్కారాలు నిర్వహించే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఒక మనిషి మరణించిన తర్వాత అతడికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించాలంటే పాక్ ప్రజలు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ముఖ్యంగా రావల్పిండి నగరంలో అంత్యక్రియల ఖర్చులు భారీగా పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
ద్రవ్యోల్బణం, కొత్త పన్నులు, ప్రభుత్వ రుసుములు పెరగడం వల్ల అంత్యక్రియలకు అవసరమైన ప్రతి వస్తువు ధర ఆకాశాన్నంటింది. మృతదేహానికి కప్పే వస్త్రం, కర్పూరం, రోజ్ వాటర్, అగరుబత్తులు, పూలు వంటి సామగ్రికే రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చవుతోందట. మృతదేహాన్ని శుభ్రపరచడం, చివరి ఏర్పాట్ల కోసం మరో రూ.5 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. సమాధి స్థలం కోసం రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు, గుంత తవ్వేందుకు మరో రూ.5 వేల వరకు ఖర్చు అవుతోంది. ఇటుకలు, సిమెంట్ తో శాశ్వత సమాధి నిర్మించాలంటే మొత్తం వ్యయం రూ.30 వేలకుపైగా చేరుతోంది. మొత్తంగా ఒక వ్యక్తి అంత్యక్రియలకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు కావడం సాధారణమైపోయిందట. అంత్యక్రియల తర్వాత వచ్చే వారికి భోజనాలు ఏర్పాటు చేయాలంటే అదనంగా రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు అవసరమవుతోందట.
ఈ భారీ ఖర్చులను భరించలేక అనేక కుటుంబాలు బంధువులు, స్నేహితుల వద్ద అప్పులు తీసుకుంటున్నాయి. మరికొందరు స్వచ్ఛంద సంస్థలు, దాతల సహాయం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధ ఒకవైపు ఉంటే.. అంత్యక్రియలకు కూడా డబ్బు ఎలా సమకూర్చాలనే ఆందోళన మరోవైపు వెంటాడుతోంది. దీంతో అక్కడి ప్రజలు మరణం కూడా ధనికులకే అందుబాటులో ఉన్న విలాసంగా మారిందా? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంకో ఆందోళనకర విషయం ఏమిటంటే.. రావల్పిండిలోని 44 శ్మశానాలు, సమాధి స్థలాలు దాదాపు పూర్తిగా నిండిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఖాళీ స్థలాలు లేకపోవడంతో సమాధి స్థలాలను బ్లాక్‌లో ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల పాత సమాధులను తొలగించి కొత్తవారికి స్థలం కల్పిస్తున్నారన్నారట.
పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని, జీడీపీ వృద్ధి పెరిగిందని, ద్రవ్యోల్బణం గతంతో పోలిస్తే తగ్గిందని చెబుతోంది. కానీ ఆ కాకి లెక్కల ప్రభావం సాధారణ ప్రజల జీవితాల్లో మాత్రం మార్పు తీసుకురావటం లేదు. ఆహారం, విద్యుత్, ఇంధనం, రవాణా, ఇళ్ల అద్దెలతో పాటు ఇప్పుడు అంత్యక్రియల ఖర్చులు కూడా అమాంతం పెరిగిపోయాయి. బ్రతకడానికి డబ్బు కావాలి.. చనిపోయిన తర్వాత కూడా డబ్బే కావాలి అనే వాస్తవం నేటి పాకిస్థాన్ ప్రజల జీవితాన్ని ప్రతిబింబిస్తోంది. ఆర్థిక పునరుద్ధరణ కథలు కాగితాలకే పరిమితమయ్యాయని, ప్రజల వాస్తవ జీవితం మాత్రం ఇంకా కష్టాల చీకటిలోనే ఉందని ఈ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కూడా ఉన్నాయి.
