చండీగఢ్: మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా రూపొందించిన 'సత్లుజ్' సినిమాను పంజాబ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఊళ్లళ్లో ప్రదర్శించనున్నట్లు శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ) అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ బుధవారం ప్రకటించారు. గతంలో ‘పంజాబ్–95’ పేరుతో ఉన్న ఈ మూవీని నిర్మాతలు ‘సత్లుజ్’ గా పేరు మార్చి జులై 3న ఓటీటీలో రిలీజ్ చేశారు. కానీ, రెండు రోజులకే ప్లాట్‌ఫారమ్ నుంచి ఈ మూవీని తొలగించారు. దీంతో కొన్ని సిక్కు సంస్థలు ఈ సినిమాను విలేజ్ మైదానాల్లో ఓపెన్‌గా ప్రదర్శించడం ప్రారంభించాయి.
ఈ నేపథ్యంలో బాదల్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందిస్తూ.. కాంగ్రెస్ పాలనలో అమాయక సిక్కులపై జరిగిన అకృత్యాలు, 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు, బూటకపు ఎన్కౌంటర్ల వాస్తవాలను భావి తరాలకు తెలియజేయడానికే ఈ ప్రదర్శనలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు, నటుడు దిల్జిత్ దోసాంజ్ నటించిన ఈ సినిమాను ఓటీటీ నుంచి తీసేయడంపై పంజాబ్ బీజేపీ విజ్ఞప్తి మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ రివ్యూ కమిటీని ఏర్పాటు చేసింది.
