- బీజీ కొత్తూరులో మోటార్ ఆన్ చేసి నీటి విడుదల
- రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా ఇవాళ వైరా చేరే అవకాశం
ఖమ్మం, వెలుగు: ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న సాగర్ ఆయకట్టు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను రైతులకు అందించేందుకు చర్యలు తీసుకుంది. సీతారామ ప్రధాన కాల్వల ద్వారా రూ.100 కోట్లతో గతేడాది నిర్మించిన రాజీవ్ లింక్ కెనాల్ ను ఉపయోగించుకొని వైరా రిజర్వాయర్ కు గోదావరి నీటిని తరలించాలని నిర్ణయించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజీ కొత్తూరు దగ్గర సీతారామ ఎత్తిపోతల పథకం మోటార్లను వెంటనే ఆన్ చేసి రైతులకు సాగు నీటిని అందించాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. దీంతో బుధవారం నీటిని విడుదల చేయగా, ఇవాళ సాయంత్రం వరకు గోదావరి జలాలు వైరాకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
1.25 లక్షల ఎకరాలకు సాగునీరు
ఖమ్మం జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టు ఉంది. కృష్ణా ప్రాజెక్టులకు ఇంకా ఇన్ఫ్లో ప్రారంభం కాకపోవడంతో ప్రస్తుతం ఆ ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని తాగునీటి కోసం వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఖమ్మం జిల్లాలో ఆయకట్టు రైతులు ఇబ్బంది పడుతున్నారు.
మరోవైపు ఇలాంటి పరిస్థితుల్లో ఉపయోగపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అప్పటి వరకు పూర్తయిన సీతారామ ప్రాజెక్టు కాలువలను ఉపయోగించుకుంటూ గోదావరి నీటిని వైరా రిజర్వాయర్కు మళ్లించేలా రాజీవ్ లింక్ కెనాల్ ను నిర్మించారు.
ఇప్పటికే గోదావరి పరీవాహక ప్రాంతంలో, ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో మోటార్లను ఆన్ చేసి రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా గోదావరి నీటిని వైరా రిజర్వాయర్కు తరలించాలన్న మంత్రి తుమ్మల ఆదేశాలతో వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లోని 1.25 లక్షల ఎకరాలకు గోదావరి నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
వినూత్న పద్ధతిలో..
సాధారణంగా సాగర్ మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా ముందుకు సాగాల్సిన గోదావరి జలాలను ప్రస్తుత అవసరాల దృష్ట్యా వినూత్న పద్ధతిలో వెనక్కు మళ్లించే ఏర్పాట్లు చేశారు. సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ నుంచి నీరు మళ్లించేలా జూలూరుపాడు మండలం వినోబానగర్ నుంచి ఏన్కూరు మండలం అక్కినాపురం తండా వరకు 8.6 కిలోమీటర్ల మేర కాల్వను తవ్వారు. అక్కడి నుంచి అప్పటికే ఉన్న ఎన్ఎస్పీ కాల్వ ద్వారా 13 కిలోమీటర్లు గోదావరి నీరు వెనక్కి ప్రయాణించి యూటీ ద్వారా ఎస్కేప్ లాకులను ఉపయోగించి వైరా రిజర్వాయర్లోకి చేరేలా ప్లాన్ చేశారు.
ఈ సాంకేతిక ప్రక్రియ ద్వారా తరలుతున్న గోదావరి జలాలు ఇవాళ సాయంత్రం వైరా రిజర్వాయర్కు చేరుకునే అవకాశం ఉంది. అక్కడి నుంచి తిరిగి సాగర్ ప్రాజెక్టు కాల్వలను ఉపయోగించుకొని సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లోని చెరువులు, తూములకు మళ్లిస్తారు. వరి నార్లు పోసుకునే సమయంలో నీరు అందుబాటులోకి వస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
