ప్రభుత్వ, అసైన్డ్ భూముల అక్రమ బదలాయింపు.. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి తహసీల్దార్ సుజాతపై వేటు

ప్రభుత్వ, అసైన్డ్ భూముల అక్రమ బదలాయింపు.. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి తహసీల్దార్ సుజాతపై వేటు
  • ఎంక్వైరీలో 56 అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తింపు
  • జిల్లాలో వరుసగా నలుగురు తహసీల్దార్లపై తీవ్ర అవినీతి ఆరోపణలు

సిద్దిపేట, వెలుగు:  సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి తహసీల్దార్ సుజాతపై సస్పెన్షన్ వేటు పడింది. అసైన్డ్, ప్రభుత్వ భూముల అక్రమ బదలాయింపు ద్వారా వందల ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినట్లు ఆమెపై తీవ్ర అభియోగాలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన కలెక్టర్ హైమావతి, తహసీల్దార్ సుజాతను సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె స్థానంలో కుకునూరుపల్లి ఇన్​చార్జి తహసీల్దార్​గా వేణుగోపాలరావు బాధ్యతలు స్వీకరించారు.

మొదటి నుంచీ అవినీతి ఆరోపణలే..

సుజాత రెండేళ్లుగా కుకునూర్ పల్లి తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నారు. దౌలతాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, గజ్వేల్ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఓ ఆఫీసులో పనిచేసినప్పుడూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కుకునూరుపల్లి మండలం మంగోలుకు చెందిన వ్యక్తి ఫిర్యాదుతో కలెక్టర్ విచారణ చేపట్టారు. తిప్పారం, రాయవరం గ్రామాల్లో వందలాది ఎకరాల సర్కారు, అసైన్డ్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినట్లు తేలింది. ఈ తరహా 56 అక్రమ రిజిస్ట్రేషన్లతోపాటు అసైన్డ్ భూముల వారసత్వ బదిలీలకు సంబంధించిన 10 రికార్డులను ఆమె ఆమోదించినట్లు వెల్లడైంది.  

వరుసగా నలుగురు తహసీల్దార్లపై ఆరోపణలు

సిద్దిపేట అర్బన్, కొండపాక, చేర్యాల, మిరుదొడ్డి, వర్గల్, జగదేవ్ పూర్, ములుగు, గజ్వేల్, చిన్నకోడూరు మండలాల్లో ఇటీవలి కాలంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్నారు. జిల్లాలో వరుసగా నలుగురు తహసీల్దార్లపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. చేర్యాల తహసీల్దార్ సందీప్ నాయక్ రెండు రోజుల క్రితం వ్యవసాయ భూమికి నాలా కన్వర్షన్ కోసం రూ.70 వేల లంచం తీసుకుంటూ దొరికిపోయాడు.

గతంలో సిద్దిపేటలో పనిచేసేటప్పుడు 59 జీవోను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తహసీల్దార్ రఘువీర్ రెడ్డి, ధరణి ఆపరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి రాఘవాపూర్ గ్రామానికి చెందిన క్యాన్సర్ పేషెంట్ మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూమిని, అతని ఫొటోలు, సంతకాలను ఫోర్జరీ చేసి ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయగా, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ధరణి ఆపరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సస్పెన్షన్ వేటు పడింది. గజ్వేల్ తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన శ్రవణ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నాలుగు నెలల క్రితం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టుకున్నారు. గతంలో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తున్నప్పుడు భూముల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.