నకిరేకల్, వెలుగు : లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న వారిని నల్గొండ జిల్లా నకిరేకల్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం నకిరేకల్ లో నల్గొండ డీఎస్పీ శివరామిరెడ్డి వెల్లడించారు. నకిరేకల్ పట్టణంలోని శివాజీనగర్ లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసర్లు మంగళవారం రాత్రి దాడి చేశారు.
దీంతో నకిరేకల్‌కు చెందిన ఆర్‌ఎంపీ బాతుక యాదగిరి, సూర్యాపేట మండలం టేకుమట్లకు చెందిన జాల జానయ్య, కేసారం గ్రామానికి చెందిన జీలుగుల భరత్ పట్టుపడగా, సోలిపేటకు చెందిన వల్లపు ప్రశాంత్, నల్గొండకు చెందిన కత్తి కనకాలరెడ్డి పరార్ అయ్యారు.
ప్రధాన నిందితుడైన బాతుక యాదగిరి గతంలోనూ ఇదే తరహా కేసుల్లో జైలుకెళ్లాడని, విడుదలైన తర్వాత మళ్లీ పోర్టబుల్ అల్ట్రాసౌండ్ స్కాన్నింగ్ యంత్రంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని డీఎస్పీ వివరించారు. దాడుల్లో డిజిటల్ అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ సిస్టమ్, ప్రోబ్, పవర్ కార్డ్, అల్ట్రాసౌండ్ జెల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
