యూపీఏ హయాంలోనే సింగరేణికి తాడిచర్ల –2 బ్లాక్ కేటాయింపు.. మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదు: డిప్యూటీ సీఎం భట్టి

యూపీఏ హయాంలోనే సింగరేణికి తాడిచర్ల –2 బ్లాక్ కేటాయింపు.. మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదు: డిప్యూటీ సీఎం భట్టి
  • ఇప్పుడు కేంద్రం ఇచ్చింది బొగ్గు తవ్వకాలకు పర్మిషన్ మాత్రమే: డిప్యూటీ సీఎం భట్టి
  • అది కూడా మేం రెండేండ్లపాటు కొట్లాడి సాధించినం
  • ఇదేదో మోదీ సర్కార్​ ఘనత అన్నట్టుగా కిషన్​రెడ్డి చెప్పుకోవడం ఆశ్చర్యకరం 
  • 13 ఏండ్లుగా మైనింగ్​ లీజులను పెండింగ్​ పెట్టి సింగరేణి భవిష్యత్తుతో ఆడుకున్నరు
  • కోయగూడెం 3, సత్తుపల్లి 2 బ్లాక్‌‌‌‌‌‌‌‌లను సింగరేణికి ఇవ్వకుండా వేలంలో పెట్టిన్రు
  • నాటి సీఎం కేసీఆర్​ వేలంపాటలో సింగరేణి పాల్గొనకుండా చేసి వాళ్ల బినామీలకు బొగ్గు బ్లాక్‌‌‌‌‌‌‌‌లు దక్కించుకున్నరు.. ఇది గిరిజన చట్టాలను అతిక్రమించడమేనని వెల్లడి
  • ప్రజా భవన్‌‌‌‌‌‌‌‌లో పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్ ​ప్రజెంటేషన్‌‌‌‌‌‌‌‌


హైదరాబాద్​, వెలుగు: భూపాలపల్లి జిల్లాలోని తాడి చర్ల–2 బ్లాక్‌‌‌‌ను 2013 సెప్టెంబర్ 16న అప్పటి యూపీఏ సర్కారు సింగరేణికి కేటాయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక్కడ మైనింగ్​ తవ్వకాలకు మాత్రమే అనుమతిచ్చిందన్నారు. బుధవారం హైదరాబాద్‌‌లోని ప్రజాభవన్‌‌లో పవర్​ పాయింట్​ ప్రజేంటేషన్​ ద్వారా మీడియాకు భట్టి విక్రమార్క వివరాలు వెల్లడించారు. 13 ఏండ్లుగా మైనింగ్​ లీజులు ఇవ్వకుండా కేంద్ర పెండింగ్​ పెడితే తాము రెండేండ్లు కొట్లాడి సాధించుకున్నామని చెప్పారు. కానీ, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌‌రెడ్డి మాత్రం సింగరేణిపై దయతో తాడిచర్ల –2 బ్లాక్‌‌ను మోదీ ప్రభుత్వమే కేటాయించినట్టు చెప్పుకోవడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు.  

రెండేండ్లు కొట్లాడితే పర్మిషన్లు వచ్చినయ్​..

ఉమ్మడి ఏపీలోనే  తాడిచర్ల –2 బొగ్గు బ్లాక్​ను అప్పటి మన్మోహన్​ సింగ్​ సర్కారు సింగరేణికి కేటాయించిందని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. కానీ 2014లో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్​ప్రభుత్వాలు ఏర్పడ్డాక ఇక్కడ సింగరేణి బొగ్గు తవ్వకాలు జరపకుండా  పదేండ్లపాటు అడ్డుపడ్డారని ఆరోపించారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత  తాడిచర్ల– -2 బ్లాక్​కోసం కేంద్రం వెంటపడ్డామన్నారు. ‘‘2024 మార్చి 7 న అప్పటి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి  ప్రహ్లాద్ జోషిని ఢిల్లీలో నేను స్వయంగా కలిసి మైనింగ్ లీజు ఇవ్వాలని విజ్ఞప్తిచేశా.  అదే ఏడాది జూన్‌‌లో హైదరాబాద్ లో కేంద్రం నిర్వహించిన బొగ్గు బ్లాక్‌‌ల వేలం సందర్భంగా నిర్వహించిన సమావేశంలోనూ పాల్గొని,   బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చా. 2024 నవంబరు 27న కూడా మరోసారి కలిసి విజ్ఞప్తి చేశా.

స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి తాడిచర్ల బ్లాక్, ఇతర బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని కోరారు. చట్టపరంగా అన్నిరకాల ఫైల్స్​ అందించాం. మొన్న మేలో కూడా నా ఢిల్లీ పర్యటనలో భాగంగా మరోమారు కేంద్ర బొగ్గు శాఖ మంత్రికి విన్నవించాం. గత రెండేండ్లుగా మా ప్రభుత్వం చేసిన పోరాటం ఫలితంగానే  కేంద్రం తాడిచర్లలో మైనింగ్​ తవ్వకాలకు అనుమతిచ్చింది” అని భట్టి వివరించారు. కానీ తాడిచర్ల –2 బ్లాక్​ను మోదీ సర్కార్​ సింగరేణికి కేటాయించినట్టు కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి చెప్పుకుంటున్నారన్నారు.  ఈ సందర్భంగా నాటి యూపీఏ సర్కారు ఇచ్చిన ఉత్తర్వులు చూపించారు. కిషన్​రెడ్డి, బీజేపీ నాయకుల మాటలు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని విమర్శించారు.  

గిరిజన చట్టాలను అతిక్రమించిన్రు!

1/70 యాక్ట్​ అమల్లో ఉన్న ప్రాంతాల్లో బొగ్గు గనులను కేవలం  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే నిర్వహించాలని నిబంధనలు చెప్తున్నా  కోయగూడెం 2, సత్తుపల్లి 2 బ్లాకులను వేలం ద్వారా కేంద్రం ప్రైవేట్​ సంస్థలకు అప్పగించడాన్ని భట్టి విక్రమార్క తప్పుపట్టారు. 2022లో జరిగిన బొగ్గు వేలంలో సింగరేణి పాల్గొనకుండా అడ్డుకున్న అప్పటి కేసీఆర్​ గవర్నమెంట్..​ తమ బినామీ సంస్థలకు బొగ్గు బ్లాక్​లు దక్కేలా చేశారన్నారు.

గిరిజన చట్టాలకు తగ్గట్టుగా ఈ రెండు బ్లాక్​లను కూడా వేలంతో సంబంధం లేకుండా సింగరేణికి అప్పగించాలని కేంద్రాన్ని భట్టి కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాశ్‌‌​, సింగరేణి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.