ఒక్క గుడిసె కూడా ఉండొద్దన్నదే ప్రభుత్వ లక్ష్యం..ఎప్పుడు ఎన్నికలొచ్చినా కాంగ్రెస్ విజయం

ఒక్క గుడిసె కూడా ఉండొద్దన్నదే ప్రభుత్వ లక్ష్యం..ఎప్పుడు ఎన్నికలొచ్చినా కాంగ్రెస్ విజయం
  •  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

వనపర్తి, వెలుగు : రాష్ట్రంలో ఒక్క పూరి గుడిసె కూడా ఉండొద్దన్న లక్ష్యంతోనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి చెప్పారు. బుధవారం మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి వనపర్తి కలెక్టరేట్ లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రారంభించి వదిలేసిన డబుల్ బెడ్ రూం ఇండ్లను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పూర్తి చేశామన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక, మట్టి విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, రెవెన్యూ, పోలీస్ ఆఫీసర్లు సమన్వయంతో పనిచేస్తూ ఇందిరమ్మ ఇండ్లకు సహకరించాలని సూచించారు. 

సాదా బైనాల విషయంలో పొజిషన్​లో ఉన్న రైతు పొలం చుట్టుపక్కల వారిని విచారించి రెగ్యులరైజ్ చేయాలని చెప్పారు. వైఎస్సార్​హయాంలో ఇండ్లు మంజూరై అసంపూర్తిగా ఉన్న వాటికీ బిల్లులు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మళ్లీ గెలిచేది కాంగ్రె ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ... గతంలో ఉన్న ఏ పథకాన్నీ తీసేయకుండానే అదనంగా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నామన్నరు. 

లబ్ధిదారులు తమకు నిర్దేశించిన పరిమితుల్లోనే ఇల్లు కట్టుకోవాలని, అప్పులు చేసుకోవద్దని సూచించారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోందన్నారు. అనంతరం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, వనపర్తి, పెబ్బేరు మున్సిపల్ చైర్ పర్సన్లు మాధవి, శ్రీనివాస్​గౌడ్​, ఎస్పీ సునీత రెడ్డి, అడిషనల్​కలెక్టర్లు ఖీమ్యానాయక్, వినోద్ కుమార్, మార్కెట్​కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. 

ఏ ఎన్నికలు వచ్చినా గెలిచేది కాంగ్రెస్సే...

గద్వాల, వెలుగు : రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా గెలిచేది కాంగ్రెస్సేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాము మళ్లీ అధికారంలోకి స్తామని బీఆర్ ఎస్ లీడర్లు పగటి కలలు కంటూ రోజుకో డ్రామా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి బుధవారం గద్వాల జిల్లా ధరూర్ మండల ర్యాలంపాడు ఆర్అండ్ఆర్ సెంటర్ లో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు దుస్తులు పెట్టి, స్వీట్లు తినిపించారు. అనంతరం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పొంగులేటి మాట్లాడారు. 

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ తల తాకట్టు పెట్టయినా నిధులను సర్దుబాటు చేస్తూ సంక్షేమ పథకాలను పేదల గుమ్మం దాకా తీసుకొస్తున్నామన్నారు. ముంపు గ్రామాలకు అదనంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గొర్రెలు మేకల ఫెడరేషన్ చైర్మన్ సరిత, కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, డీసీసీ అధ్యక్షులు రాజీవ్ రెడ్డి, సర్పంచ్ వెంకట్రాంరెడ్డి 
పాల్గొన్నారు.