ఆర్టీసీని లాభాల బాట పట్టించాం.. మహాలక్ష్మి పథకంతో మహిళలకు రూ. 11 వేల కోట్లు ఆదా

ఆర్టీసీని లాభాల బాట పట్టించాం.. మహాలక్ష్మి పథకంతో మహిళలకు రూ. 11 వేల కోట్లు ఆదా
  • మంత్రి పొన్నం ప్రభాకర్​ 

నాగర్​కర్నూల్, వెలుగు : 'గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్లక్ష్యం చేసింది, పదేండ్లలో ఒక్క బస్సును కూడా కొనలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీని లాభాల బాట పట్టించాం' అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. బుధవారం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి, కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ తో కలిస నాగర్ కర్నూల్ లో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ... బీఆర్ ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మెను పట్టించుకోకుండా పంతాలకు పోయి సంస్థను సంక్షోభంలోకి నెట్టిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రారంభించిన మహాలక్ష్మి పథకం కింద 326 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయని, ఈ పథకం ద్వారా మహిళలు రూ.11,377 కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను మూడు రోజుల్లోనే పరిష్కరించి, ఉద్యోగాలకు దూరమైన 355 మందికి నియామక పత్రాలు అందించామన్నారు. 

'సర్' కార్యక్రమంపై ప్రజలు అలర్ట్ గా ఉండాలని, అర్హులైన ప్రతిఒక్కరూ ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయాలని సూచించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే.. ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, సన్న వడ్లకు బోనస్ వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. అనంతరం నాగర్ కర్నూల్ నుంచి తూడుకుర్తి మీదుగా వనపర్తికి వెళ్లే బస్సు ప్రారంభించారు. 

అలాగే జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అడిషనల్ కలెక్టర్లు దేవ సహాయం, అరుణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్ పాల్గొన్నారు. అలాగే పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.