హైదరాబాద్, వెలుగు: మూడు నెలలు మంత్రి పదవి ఇస్తే చాలు కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు పూర్తి చేసి ఇస్తానని హరీశ్ రావు అనడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. బుధవారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. మూడు నెలల మంత్రి పదవి అడగడం అనేది హరీశ్‌కు పిల్లలాటలాగా ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నీకు మంత్రి పదవిపై అంత మోజు ఉంటే ముందుగా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకో... ఆ తర్వాత ఆలోచిస్తాం.
పదేండ్లు పాలించి, అందులో మూడేండ్లు ఇరిగేషన్ మంత్రిగా పనిచేశావు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం, కూలడం అన్ని మీ చేతుల మీదే జరిగాయి. ఇప్పుడు మూడు నెలలు మంత్రి పదవి ఇస్తే ఏం చేస్తావు” అని ఫైర్ అయ్యారు. ప్రాజెక్టులో నీళ్లు నింపండి అని అంటున్నావు, మరి ఖమ్మం మునిగిపోవాలా..? ఆ జిల్లా మునిగిపోతే తానే బాధ్యత తీసుకుంటా అని సీఎంకు లేఖ రాసివ్వు అని హరీశ్‌కు జగ్గారెడ్డి సూచించారు.
