హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి అవసరమైన ఎరువులను అదనంగా కేటాయించాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాకు లేఖ రాశారు. వానాకాలం ఇప్పటికే రాష్ట్రంలో 55.52 లక్షల ఎకరాల్లో విత్తనాలు పూర్తయ్యాయని తెలిపారు. సాగు విస్తీర్ణం పెరగడంతో ఎరువుల అవసరం కూడా ఎక్కువైందన్నారు.
ఏప్రిల్ నుంచి జూన్ వరకు కేంద్రం నుంచి రావాల్సిన ఎరువులు పూర్తిస్థాయిలో అందలేదని, ముఖ్యంగా డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల కొరత ఏర్పడిందని చెప్పారు. ఏప్రిల్, -జూన్ మధ్య యూరియా 0.45 లక్షల టన్నులు, డీఏపీ 1.04 లక్షల టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 2.53 లక్షల టన్నుల మేర లోటు ఏర్పడిందన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో తయారయ్యే యూరియాలో 90 శాతానికి పైగా తెలంగాణకే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
