ఎఫ్‌‌పీఓలకు ప్రభుత్వం ప్రాధాన్యం...కొనుగోలు కేంద్రాలు, లైసెన్సుల్లో మొదటి సారి అవకాశం

ఎఫ్‌‌పీఓలకు  ప్రభుత్వం ప్రాధాన్యం...కొనుగోలు కేంద్రాలు, లైసెన్సుల్లో మొదటి సారి అవకాశం

హైదరాబాద్, వెలుగు: రైతు ఉత్పత్తిదారుల సంస్థల (ఎఫ్‌‌పీఓ)ను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. కనీస మద్దతు ధర, ధర మద్దతు పథకం (పీఎస్‌‌ఎస్) కింద ఏర్పాటు చేసే పంటల కొనుగోలు కేంద్రాల నిర్వహణలో అర్హత కలిగిన ఎఫ్‌‌పీఓలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించింది. వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. మౌలిక సదుపాయాలు, ఆర్థిక సామర్థ్యం, శిక్షణ పొందిన సిబ్బంది ఉన్న ఎఫ్‌‌పీఓలను జిల్లా కలెక్టర్లు గుర్తించి కొనుగోలు కేంద్రాల బాధ్యతలు అప్పగించనున్నారు. 

అలాగే, ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల విక్రయాలకు అవసరమైన లైసెన్సులను ఎఫ్‌‌పీఓలకు ప్రాధాన్యంతో మంజూరు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఐఎఫ్‌‌ఎఫ్‌‌సీవో యూరియా, గ్రీన్ మ్యాన్యూర్ తదితర వ్యవసాయ ఇన్‌‌పుట్ల పంపిణీలోనూ ఎఫ్‌‌పీఓలకు ప్రాధాన్యం కల్పించనున్నారు. ఉత్తర్వుల అమలుపై జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ, మార్క్‌‌ఫెడ్, వ్యవసాయ శాఖ అధికారులు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది.