దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి..కేంద్రం ఆలస్యం చేయొద్దు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి..కేంద్రం ఆలస్యం చేయొద్దు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడం రాజ్యాంగబద్ధమైన హక్కు అని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మతం మారినా దళితుల సామాజిక పరిస్థితులు, కుల వివక్ష, పేదరికం మారడం లేదని చెప్పారు. అలాంటప్పుడు వారికి రావాల్సిన హక్కులను నిరాకరించడం సరికాదన్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బేగంపేట టూరిజం ప్లాజాలో బుధవారం నిర్వహించిన దళిత క్రైస్తవ రిజర్వేషన్ల సమాలోచన సభలో మంత్రి అజారుద్దీన్, ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీంతో కలిసి మంత్రి పాల్గొని మాట్లాడారు. 

దళిత క్రైస్తవుల సమస్యను మతపరమైన అంశంగా కాకుండా సామాజిక న్యాయ సమస్యగా చూడాలని అన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం కమిటీలు, నివేదికల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. వెంటనే రాజ్యాంగబద్ధమైన చర్యలు తీసుకుని వారికి ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ.. 1950 నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వల్ల దళిత క్రైస్తవుల హక్కులకు నష్టం జరుగుతోందన్నారు. తమ హక్కుల కోసం దళిత క్రైస్తవులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు  తదితరులు పాల్గొన్నారు. 

గురుకుల స్టూడెంట్ల మెనూపై అప్రమత్తంగా ఉండాలి

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మెనూ, హెల్త్ విషయంలో  అప్రమత్తంగా ఉండాలని అధికారులను సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు. ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రత, నాణ్యమైన విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రత్యేక నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. బుధవారం ఆయన సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎస్సీ వెల్ఫేర్ కమిషనర్ విజయేంద్ర బోయి, ఎస్టీ, ఎస్సీ గురుకుల సెక్రటరీలు సీతాలక్ష్మి, శారదలతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. గురుకులాల్లో ప్రవేశాల ప్రక్రియ పారదర్శకతతో చేపట్టాలని ఆదేశించారు. అర్హులకు సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.