వర్షాలు కురవాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించండి: దేవాదాయ, మైనారిటీ శాఖలకు మంత్రి పొన్నం లేఖ

వర్షాలు కురవాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించండి:  దేవాదాయ, మైనారిటీ శాఖలకు మంత్రి పొన్నం లేఖ

ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో  రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ మేరకు  గురువారం (జులై 09) దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి  అజారుద్దీన్‌ లకు  లేఖ రాశారు. 

ప్రస్తుత సంవత్సరం ఎల్ నినో  ప్రభావంతో  నైరుతి రుతుపవనాలు బలహీనపడడంతో  రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోందని.. ఈ క్రమంలో  తెలంగాణ ప్రజల శ్రేయస్సు, రైతాంగ సంక్షేమం దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించాలని కోరారు.

రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక అభిషేకాలు, హోమాలు, యాగాలు నిర్వహించాలని దేవాదాయ శాఖను కోరారు. అలాగే రాష్ట్రంలోని మసీదులు, చర్చిలు , గురుద్వారాల్లో  ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రాష్ట్రానికి సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థనలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి నీ కోరారు.

వ్యవసాయం ప్రధాన ఆధారంగా ఉన్న తెలంగాణలో వర్షాలు సమృద్ధిగా కురవడం అత్యంత అవసరమని పేర్కొన్న మంత్రి పొన్నం , ప్రకృతి అనుకూలించి రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి మేలు జరగాలని ఆకాంక్షిస్తూ అన్ని మతాల వారు సామూహిక ప్రార్థనలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, రైతాంగ శ్రేయస్సు కోసం ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.