హైదరాబాద్: నెక్ట్స్ జెన్ సోలార్ మాడ్యూల్ తయారీ కేంద్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రీమియర్ ఎనర్జీస్ ఆధ్వర్యంలో యూనిట్ ఏర్పాటు చేశారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను ప్రారంభించిన సీఎం.. అత్యంత వేగంగా నిర్మించిన పరిశ్రమ ఇదని చెప్పారు. నివాస యోగ్యమైన అత్యంత బెస్ట్ సిటీ హైదరాబాద్ అని సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు.
ప్రీమియర్ ఎనర్జీస్ టీంకు అభినందనలు తెలిపారు. మూసీని ప్రక్షాళించాలని తమ ప్రభుత్వం భావిస్తోందని, క్యూర్, ప్యూర్, రేర్గా రాష్ట్రాన్ని విభజించామని సీఎం వివరించారు. కాలుష్యకార పరిశ్రమలను సిటీ అవతలికి తరలిస్తున్నామని తెలిపారు.
ప్యూర్ ఏరియాలో ప్రీమియర్ ఎనర్జీని నెలకొల్పామని, గత ఏడాది డిసెంబర్ నెలలో పనులు ప్రారంభమై పూర్తయ్యాయని, 1.34 కోట్ల మంది ORR లోపల జీవిస్తున్నారని సీఎం గుర్తుచేశారు. 2047 నాటికి దేశ ఎకానమీలో తెలంగాణ భాగస్వామ్యం 10 శాతం ఉండాలని సీఎం కాంక్షించారు. మన బలం యువత అని, తాము యువత కోసం బ్లూ కాలర్ జాబ్స్ సృష్టిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.
IITలను ATCలుగా మార్చామని, యువతకు స్కిల్స్ ఇప్పించి ఉద్యోగాలు కల్పిస్తున్నామని సీఎం చెప్పారు. ప్రణాళిక ప్రకారం రాష్ట్రం ముందుకెళుతోందని, ప్రపంచంతో పోటీ పడాలంటే ఈ పరిశ్రమలు సరిపోవని తెలిపారు. చదువున్నా విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యం లేదని, యువతలో నైపుణ్యాభివృద్ధి కోసమే స్కిల్ వర్సిటీ అని రేవంత్ రెడ్డి చెప్పారు.
ఢిల్లీలో నేడు నివసించలేని పరిస్థితి ఉందని సీఎం నిట్టూర్చారు. సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి అని ఆయన చెప్పారు. ఎల్ నినోతో మన దగ్గర వర్షాలు లేవని, అధిక వర్షాలతో ముంబై అతలాకుతలం అవుతుందని సీఎం వివరించారు. బెంగళూరు, చెన్నై పరిస్థితులు కూడా అంతేనని తెలిపారు. హైదరాబాద్ సిటీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, కృత్రిమ ఆక్సిజన్లు తయారు చేసే పరిస్థితి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
