షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయలేక.. రోజు, రెండు రోజులకోసారి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వేసుకోలేక ఇబ్బంది పడుతున్న మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది గుడ్ న్యూస్. ఇక నుంచి అలాంటి కష్టాలు లేకుండా.. వారానికి ఒక ఇన్సులిన్ సరిపోయేలా ఇండియాలో కొత్త ఇన్సులిన్ లాంచ్ చేసింది నోవో నోర్డిస్క్ కంపెనీ. బుధవారం (జులై 08)న వారానికి ఒకసారి వేసుకుని ఆవిక్లి ( Awiqli) లేదా ఇన్సులిన్ ఐకోడెక్ ను లాంచ్ చేసింది.
టైప్ 1, టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్ కు వారానికి ఒకసారి వేసుకునే ఇన్సులిన్ ఇది. ప్రపంచంలోనే తొలి ఇంజెక్షన్ కావడం విశేషం. ఇది వారానికి ఒక రోజు అంటే.. సంవత్సరానికి 365 రోజులకు 52 సార్లు వేసుకుంటే సరిపోతుంది.
ఆవిక్లీ మందు ఒక్కో యూనిట్ 3.73 రూపాయలు ఉంటుందని కంపెనీ తెలిపింది. 700 యూనిట్స్, 2,100 యూనిట్స్ ఇంజెక్షన్ పెన్ ఆప్షన్స్ తో ఇండియాలో విడుదల చేసినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియా తెలిపారు.
ఇండియాలో తొలి మెడిసిన్ ను లాంచ్ చేసిన కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఇండియాలో ఇన్సులిన్ వాడకాన్ని ప్రోత్సహించడంలో ఉన్న అతిపెద్ద అడ్డంకులలో ఒకటైన ప్రతిరోజూ ఇంజెక్షన్లు తీసుకోవాలనే భయాన్ని పరిష్కరించేందుకు ఈ కొత్త మందును రూపొందించినట్లు తెలిపారు. దేశంలో 4,500 దిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఈ మందు అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.
►Also Read ; ఈ 7 అలవాట్లు కచ్చితంగా ఫాలో అవ్వండి
ఇండియాలో దాదాపు 10.1 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతుండగా, సుమారు 13.6 కోట్ల మంది ప్రీడయాబెటిస్‌తో ఉన్నారు. దేశంలో 9 లక్షలకు పైగా ప్రజలు టైప్ 1 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ఇది ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి, దీని నిర్వహణ ప్రధానంగా ఇన్సులిన్ థెరపీపై ఆధారపడి ఉంటుంది.
శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం వల్ల కలిగే జీవక్రియ సంబంధిత కారణాలతో వచ్చే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో సుమారు 10 శాతం మందికి ఇన్సులిన్ థెరపీ కూడా అవసరం అవుతుంది.
ఇందియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఐదు ఇన్సులిన్ బ్రాండ్‌లలో నాలుగు, అంటే మిక్స్‌టార్డ్, రైజోడెగ్‌తో సహా, ప్రస్తుతం నోవో నార్డిస్క్ కంపెనీ తయారు చేస్తోంది.
