ఫ్రాన్స్‌తో క్వార్టర్ ఫైనల్‌కు ముందు మొరాకోకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్! 

ఫ్రాన్స్‌తో క్వార్టర్ ఫైనల్‌కు ముందు మొరాకోకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్! 

Morocco vs France: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026)లో అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతున్న మొరాకో జట్టుకు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కంటే ముందు బిగ్ షాక్ తగిలింది. ఫ్రాన్స్‌తో జరగబోయే హై-వోల్టేజ్ పోరుకు ఆ జట్టు స్టార్ ఫార్వర్డ్ ప్లేయర్ ఇస్మాయిల్ సాయిబరి గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని మొరాకో హెడ్ కోచ్ మొహమ్మద్ ఔహ్బీ అధికారికంగా ధృవీకరించారు.

ఇస్మాయిల్ సాయిబరి అప్డేట్:

ఇటీవలే ప్రముఖ క్లబ్ బేయర్న్ మ్యూనిచ్‌లో చేరిన ఇస్మాయిల్, కెనడాతో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో కేవలం 22 నిమిషాలకే హామ్‌స్ట్రింగ్ గాయంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. బోస్టన్ స్టేడియంలో ఫ్యాన్స్ తో జరగబోయే నెక్ట్స్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కీలక మ్యాచ్ సమయానికి అతను కోలుకునే అవకాశం లేదన్నారు. కానీ, టోర్నీలో మొరాకో ముందడుగు వేస్తే తదుపరి మ్యాచ్‌లకు అతను అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందని కోచ్ పేర్కొన్నాడు. 

మొరాకో రన్‌ మెషీన్ ఇస్మాయిల్: 

ఈ ప్రపంచకప్‌లో మొరాకో జట్టు క్వార్టర్స్ దాకా చేరిందంటే అందులో ఇస్మాయిల్ సాయిబరి పాత్ర ఎంతో కీలకం. టోర్నీలో మూడు కీలక గోల్స్ చేసి జట్టులోనే లీడింగ్ గోల్‌స్కోరర్‌గా నిలిచాడు. గ్రూప్ దశలో బ్రెజిల్‌తో జరిగిన మ్యాచ్‌లో (1–1డ్రా) ఒక గోల్, స్కాట్లాండ్‌పై (1–0 విజయం) విన్నింగ్ గోల్, ఆ తర్వాత హైతీపై (4–2 విజయం) ఈక్వలైజర్ గోల్ సాధించి జట్టును ముందుకు నడిపించాడు. రౌండ్ ఆఫ్ 32లో నెదర్లాండ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో మోస్ట్ ఇంపార్టెంట్ పెనాల్టీని గోల్‌గా మలిచి మొరాకోను ప్రి-క్వార్టర్స్‌కు చేర్చాడు. ఈ స్టార్ ప్లేయర్ క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్‌కు దూరం కావడం మొరాకోకు కోలుకోలేని దెబ్బే అని చెప్పాలి. 

కోచ్ పక్కా ప్లానింగ్: 

ఇస్మాయిల్ సాయిబరి స్థానంలో అల్ ఐన్ స్ట్రైకర్ సౌఫియాన్ రహిమిని బరిలోకి దించేందుకు మొరాకో థింక్ ట్యాంక్ ప్లాన్ చేస్తోంది. కెనడాతో జరిగిన గత మ్యాచ్‌లో రహిమి ఇంజూరీ టైమ్‌లో అదిరిపోయే గోల్ చేసి మొరాకో 3–0తో గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతకు ముందు హైతీపై జరిగిన మ్యాచ్‌లోనూ అతను స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఇస్మాయిల్ లేకపోయినా తమ జట్టులోని ప్రతి ఒక్కరిపై తనకు పూర్తి నమ్మకం ఉందని కోచ్ ఔహ్బీ తెలిపాడు. టోర్నీలో సుదీర్ఘ కాలం ప్రయాణించాలంటే బెంచ్ బలం చాలా ముఖ్యం, సబ్‌స్టిట్యూట్‌గా వచ్చే ప్లేయర్స్ కూడా మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

2022 నాటి పరాజయానికి ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్: 

మొరాకో జట్టుకు ఈ మ్యాచ్ కేవలం క్వార్టర్ ఫైనల్ మాత్రమే కాదు.. తమ పాత పగను తీర్చుకునే సువర్ణావకాశం కూడా.. 2022 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో ఫ్రాన్స్ (లెస్ బ్లూస్) చేతిలో 2–0తో ఓడిపోయిన మొరాకో గుండె పగిలింది. ఆఫ్రికా ఖండం నుంచి వరల్డ్ కప్ సెమీస్ చేరిన మొదటి జట్టుగా మొరాకో అప్పట్లో చరిత్ర సృష్టించినప్పటికీ, ఫ్రాన్స్ వారి టైటిల్ కలలను చెరిపేసింది. మరి ఇప్పుడు ఇస్మాయిల్ సాయిబరి లేకపోయినా, మొరాకో అట్లాస్ లయన్స్ కసితో ఆడి ఫ్రాన్స్‌పై రివెంజ్ తీర్చుకుంటారో లేదో మరీ.