హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2026 మెుదటి 6 నెలల్లో మరోసారి తన బలాన్ని చాటుకుంది. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల ఆసక్తి, ఉద్యోగ అవకాశాల పెరుగుదల, ఐటీ రంగం విస్తరణ వంటి అంశాలు నగర రియల్ ఎస్టేట్ గ్రోత్ కి కారణాలుగా నిలుస్తున్నాయి. మార్కెట్‌లో సప్లై, డిమాండ్ మధ్య సమతుల్యత కొనసాగడంతో రెసిడెన్షియల్, ఆఫీస్ విభాగాల్లో హైదరాబాద్ మంచి పనితీరు కనబరిచింది.
రెసిడెన్షియల్ మార్కెట్ విషయానికి వస్తే.. 2026 జనవరి నుంచి జూన్ వరకు హైదరాబాద్‌లో 19వేల 249 ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 1 శాతం వృద్ధిని సాధించింది. అదే సమయంలో కొత్తగా ప్రారంభమైన ప్రాజెక్టులు 20వేల 466 యూనిట్లుగా నమోదయ్యాయి. సరఫరా కొంత తగ్గినా డిమాండ్ స్థిరంగా కొనసాగడంతో హైదరాబాద్ రియల్టీ మార్కెట్ ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో ఉన్నట్లు సూచిస్తోంది.
హైదరాబాద్‌లో మధ్యస్థాయి ధరల్లోని ఇళ్లకు ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. కోటి రూపాయల నుంచి రూ.2కోట్ల మధ్య రేటు కేటగిరీలో ఇళ్ల అమ్మకాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ విభాగంలో ఇన్వెంటరీ ఒత్తిడి తక్కువగా ఉండటం కొనుగోలుదారుల ఆసక్తిని చూపిస్తోంది. మరోవైపు రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్య ప్రీమియం హౌసింగ్ విభాగంలో కూడా స్థిరమైన డిమాండ్ కొనసాగుతోంది.
నగరంలోని ప్రముఖ ప్రాంతాల్లో రేట్లు కూడా పెరుగుతున్నాయి. బంజారాహిల్స్‌లో రెసిడెన్షియల్ ప్రాపర్టీల ధరలు ఏడాదిలో 7 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.14వేల 400 నుంచి రూ.16వేల 020 వరకు చేరుకున్నాయి. నగర సగటు నివాస ధరలు కూడా 7 శాతం వృద్ధితో చదరపు అడుగుకు రూ.8వేల 258కు చేరాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెరుగైన కనెక్టివిటీ, ఉద్యోగ అవకాశాలు పెరగడం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.
ఇక హైదరాబాద్ ఆఫీస్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత వేగంగా దూసుకెళ్తోంది. 2026 తొలి అర్ధభాగంలో ఆఫీస్ లీజింగ్ 7.5 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 29 శాతం ఎక్కువ. ముఖ్యంగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (GCCలు) హైదరాబాద్‌పై నమ్మకం పెంచుకోవడంతో భారీ స్థాయిలో ఆఫీస్ స్పేస్‌ను తీసుకుంటున్నాయి.
ఐటీ, టెక్నాలజీ కంపెనీల విస్తరణ, నైపుణ్యం కలిగిన ఉద్యోగుల లభ్యత, వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణం హైదరాబాద్‌ను దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటిగా నిలబెడుతున్నాయి. కొత్త ఆఫీస్ స్పేస్ సరఫరా వచ్చినప్పటికీ వేకెంట్ స్థలాల శాతం తగ్గడం నగరంపై పెరుగుతున్న డిమాండ్‌కు అద్దం పడుతోంది. సో రాబోయే రోజుల్లో కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఇదే తరహాలో స్థిరమైన గ్రోత్ స్టోరీని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
