- భారీగా నకిలీ పత్రాలు, రబ్బరు స్టాంపులు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన సీపీ
పద్మారావునగర్, వెలుగు : అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి, నకిలీ స్టాంపులతో జీపీఏ, మార్టిగేజ్రిలీజ్ డీడ్లు, సేల్ డీడ్లు, గిఫ్ట్ డీడ్లు సృష్టించి మోసాలను పాల్పడుతున్న ఓ డాక్యుమెంట్రైటర్ను, సహకరించిన మరొకరిని ఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ, స్థానిక పోలీసులు అరెస్ట్‌చేశారు. వివరాలను మల్కాజిగిరి సీపీ సుమతి బుధవారం వెల్లడించారు. కాకినాడకు చెందిన దేవాగుప్తాపు వీర వెంకట సత్యనారాయణ ఎల్బీనగర్ లింగోజిగూడలో ఉంటూ డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో మీసేవ కేంద్రం కూడా నడిపిన ఇతడు తన డ్రైవర్ పోలె రాజుతో కలిసి ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు. ఎనిమిదేళ్లుగా కొంతమందితో కలిసి నకిలీ పత్రాలను తయారు చేసి మోసగాళ్లకు ఇస్తున్నాడు.
పోలీసులకు తెలియడంతో ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ నంబర్ 202పై రైడ్స్చేశారు. సత్యనారాయణతో పాటు పోలె రాజును అదుపులోకి తీసుకున్నారు. సత్యనారాయణ జీహెచ్‌ఎంసీ, హెచ్ఎండీఏ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ మార్టిగేజ్రిలీజ్ డాక్యుమెంట్లు తయారు చేసి ఆజంపురా, చిక్కడపల్లి, గోల్కొండ, గండిపేట, బంజారాహిల్స్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఎస్సార్ నగర్, పెద్దఅంబర్‌పేట, బాటసింగారం తదితర ప్రాంతాల్లో విలువైన స్థలాలు కబ్జా చేసినట్టు తెలిసింది.
మోతీనగర్, అక్బర్‌బాగ్, మంఖాల్, కర్మన్‌ఘాట్, యాచారం పరిధిలోని ఆస్తులకు సంబంధించిన నకిలీ దస్తావేజులు, నాన్-జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు దొరికాయి. నకిలీ రబ్బరు స్టాంపులు, సీల్స్‌ను జప్తు చేశారు. దందాలో సత్యనారాయణకు క్లయింట్లను తీసుకువచ్చిన అడ్వొకేట్మహ్మద్ జహీర్ అహ్మద్, గులాం మహ్మద్ ఖాన్, జీహెచ్‌ఎంసీ, హెచ్ఎండీఏ ఆఫీసర్లుగా నటిస్తూ సహకరించిన చీదెల శివ నాగేశ్వరరావు, యంపల్ల మహిపాల్ రెడ్డి, నకిలీ సాక్షులుగా వ్యవహరించిన వట్టి కోటి భాస్కర్, బావిశెట్టి విజయ్ కుమార్ పరారీలో ఉన్నారు.
నకిలీ జీపీఏలతో భూ లావాదేవీలు
కీసర : నకిలీ జీపీఏలతో తప్పుడు పత్రాలను సృష్టించి భూ లావాదేవీలు చేస్తున్న ఐదుగురిని కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. కీసర పీఎస్‌లో జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి వివరాలు వెల్లడించారు. దొంగ పత్రాలతో తన జాగా కొట్టేయాలని చూస్తున్నారని గత ఏడాది తోట వెంకట్‌రెడ్డి ఫిర్యాదు చేశాడు. అతడికి కీసర మండలంలోని సర్వే నంబర్ 94లో కొంత భూమి ఉంది. రియల్ఎస్టేట్ దందా చేసే బర్లపాటి ఆనంద్, బొర్రా వెంకటేష్, మీర్ సాదిక్ అలీ, సత్యారెడ్డి తమకు వెంకట్‌రెడ్డి జీపీఏ ఇచ్చారని నకిలీ పత్రాలు సృష్టించి బసరికారి శ్రీనివాస్‌రావుకు అమ్మినట్టు తేలింది. ఈ కేసులో మరికొందరి పాత్రపైనా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
