TGSRTC దసరా స్పెషల్ : బతుకమ్మ పండక్కి 7 వేల స్పెషల్ బస్సులు.. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా చర్యలు

TGSRTC దసరా స్పెషల్ : బతుకమ్మ పండక్కి 7 వేల స్పెషల్ బస్సులు.. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా చర్యలు
  • 9, 10, 16, 17, 25, 26 తేదీల్లో నడపనున్న ఆర్టీసీ
  • స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు 
  • మహిళలకు యథావిధిగా ఉచిత బస్సు ప్రయాణం

హైదరాబాద్, వెలుగు: బతుకమ్మ, దసరా పండుగల రద్దీ దృష్ట్యా 7 వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఈ నెల 9,10,16, 17 తేదీల్లో ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతామని బుధవారం మీడియాకు ప్రకటన విడుదల చేసింది. తిరుగు ప్రయాణం సందర్భంగా 25, 26 తేదీల్లో కూడా ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు వెల్లడించింది.  

ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలను వసూలు చేస్తామని, రెగ్యులర్ గా తిరిగే బస్సుల్లో మాములు చార్జీలే ఉంటాయని స్పష్టత ఇచ్చింది. బస్సు స్టేషన్లలో ప్రయాణికుల కోసం షామియానాలు, కుర్చీలు, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. 

మహాలక్ష్మి పథకంలో భాగంగా దసరాకు నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ రెగ్యులర్  బస్సులతో పాటు స్పెషల్ బస్సు అని బోర్డు ఉన్నా.. మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. 

హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ (నల్ల చెరువు), ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌‌బీ, బోయిన్ పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి  ప్రత్యేక బస్సులు నడుస్తాయని వెల్లడించారు.  www.tgsrtcbus.in వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు  సూచించారు. ప్రత్యేక బస్సుల సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 ను సంప్రదించవచ్చన్నారు.

ప్రత్యేక బస్సుల వివరాలు ఇలా.. 

  • కరీంనగర్ జోన్: 3,533 బస్సులు
  •  (రీజియన్ల వారీగా ఆదిలాబాద్ 431, నిజామాబాద్ 719, కరీంనగర్ 1175, వరంగల్ 530, ఖమ్మం 678)
  • హైదరాబాద్ జోన్: 2,155 బస్సులు (రీజియన్ల వారీగా మహబూబ్ నగర్ 645, మెదక్ 255 , నల్గొండ 815, రంగారెడ్డి 440)
  • గ్రేటర్ హైదరాబాద్ జోన్ : 1312 బస్సులు