కఠినాత్ములు కాదు కరుణామయులు..

కఠినాత్ములు కాదు కరుణామయులు..
  • మానసిక స్థితి సరిగ్గా లేదనివదిలేసిన కుటుంబ సభ్యులు 
  • అక్కున చేర్చుకున్నచిలకలగూడ పోలీసులు

పద్మారావునగర్, వెలుగు :  పోలీసులను చూస్తే చాలామంది భయపడతారు..జాలి, కరుణ, దయ ఉండదని ఆడిపోసుకుంటారు.‘లాఠి’న్యమే తప్ప కరుణరసం ఏమాత్రం లేని కఠిన హృదయులని అనుకుంటారు. కానీ, అది నిజం కాదని నిరూపించారు హైదరాబాద్​లోని చిలకలగూడ పోలీసులు..ఓ వ్యక్తికి మానసిక స్థితి సరిగ్గా లేదని వదిలేయగా..అక్కున చేర్చుకుని హాస్పిటల్​లో చేర్పించి బాగు చేయించారు. కుటుంబసభ్యులు చేరదీయడానికి ఇష్టపడకపోవడంతో అనాథాశ్రమంలో చేర్పించి శభాష్​అనిపించుకున్నారు.  

ఏం జరిగిందంటే..

గత నెల 23వ తేదీన గాంధీ దవాఖాన మెట్రో స్టేషన్ సమీపంలో డ్యూటీ చేస్తున్న చిలకలగూడ పోలీసులకు రోడ్డుపై నిస్సహాయ స్థితిలో తీవ్రమైన అనారోగ్యంతో పడి ఉన్న ఓ వ్యక్తి కనిపించాడు. ఆరా తీయగా తన పేరు వెంకటేశం (55) అని తనది మంచిర్యాల జిల్లా అని చెప్పాడు. తనకు భార్య, కొడుకు, బిడ్డ ఉన్నారని వెల్లడించాడు. విషయం తెలుసుకున్న చిలకలగూడ ఎస్ హెచ్ వో వలిశెట్టి రామకృష్ణ చలించిపోయారు. వెంటనే అతడిని గాంధీ దవాఖానలో చేర్పించారు.

కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా ‘అతడి మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. అతడితో మాకు సంబంధం లేదు’అని పెట్టేశారు. దీంతో అతడికి గాంధీలో ట్రీట్​మెంట్​ఇప్పించి బాగయ్యాక బోయగూడలోని మిషనరీస్ ఆఫ్ చారిటీ ఆశ్రమానికి తరలించారు. బాధితుడికి కొత్త జీవితాన్నిచ్చిన ఎస్ హెచ్ వో రామకృష్ణతో పాటు హెడ్ కానిస్టేబుల్ పూస శ్రీనివాస్, ఏఎస్ఐ దామోదర్ రెడ్డిని పలువురు అభినందించారు.