యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (వైటీడీ) పేరుతో www.ytdtemple.com వెబ్‌సైట్‌ను స్వర్ణగిరి ఆలయ నిర్వాహకులు రూపొందించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు యాదగిరిగుట్ట ఆలయ ఆఫీసర్ల దృష్టికి వచ్చింది. దీంతో ఈ నెల 5న స్వర్ణగిరి ఆలయ నిర్వాహకులకు యాదగిరిగుట్ట ఆలయ ఆఫీసర్లు నోటీసులు జారీ చేశారు. ఈ విషయంపై ఈ నెల 6న ‘వెలుగు’ దినపత్రికలో ‘స్వర్ణగిరి ఆలయానికి లీగల్ నోటీసులు’ పేరుతో వార్తా కథనం ప్రచురితమైంది. ఈ కథనం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బుధవారం స్వర్ణగిరి ఆలయ ప్రతినిధులు స్పందించారు. యాదగిరిగుట్ట ఆలయ ఈవో భవానీ శంకర్‌ను కలిశారు.
యాదగిరిగుట్ట ఆలయానికి మచ్చ తెచ్చే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. వెబ్‌సైట్ నిర్వహణపై నరసింహస్వామి భక్తుల నుంచి తీవ్ర
అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వెంటనే వెబ్‌సైట్‌ను బ్లాక్ చేసి కార్యకలాపాలను నిలిపివేసినట్లు వివరించారు. స్వర్ణగిరి ఆలయ చైర్మన్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారని, ఆయన తిరిగి వచ్చిన వెంటనే యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చి పూర్తి వివరాలను సమర్పిస్తారని ఈవోకు తెలిపారు. జరిగిన పరిణామాలపై స్వర్ణగిరి ఆలయం తరఫున చింతిస్తూ, యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి భక్తులకు క్షమాపణలు కోరినట్లు ఆలయ ఆఫీసర్లు తెలిపారు.
