నారాయణగూడ, వెలుగు : ‘సర్’ను ఉపయోగించుకుని కొంతమంది చేస్తున్న తప్పుల కారణంగా ప్రజలు తనను నిలదీస్తున్నారని మాజీ మంత్రి దానం నాగేందర్ వాపోయారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని హిమాయత్‌నగర్ డివిజన్ అవంతినగర్‌లో బుధవారం దానం పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు తమ ఓట్లను అక్రమంగా తొలగించారని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన దానం ‘ఒక పార్టీకి చెందిన బీఎల్‌ఏలు ఉద్దేశపూర్వకంగా నాకు వ్యతిరేకంగా ఉన్నవారి ఓట్లను తొలగిస్తున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్కాదు’ అని కామెంట్చేశారు.
బతికున్నోళ్లను చంపేస్తున్న ‘సర్’
ట్యాంక్ బండ్ : ‘సర్’ తప్పుల తడకగా సాగుతోందని, అసలు ఏ ఫారం ఎవరికి ఇస్తున్నారో అర్థం కావడం లేదని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ యాదవ్ ఆరోపించారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బుధవారం రాత్రి మాట్లాడుతూ భోలక్ పూర్ డివిజన్ పరిధిలోని బూత్ నంబర్124లో ఓటరుగా ఉన్న బిల్కీస్ సుల్తానా బతికి ఉన్నా చనిపోయినట్టు చూపుతూ ఫారం 7 ద్వారా ఆన్ లైన్ లో నమోదు చేశారన్నారు. పైగా, ఐదేండ్ల కింద మరణించిన ఆమె భర్త రఫీయుద్దీన్ స్వయంగా ఫారం 7 రాసి, సంతకం చేసి దరఖాస్తు చేసినట్టు చూపారన్నారు. భోలక్ పూర్ లోని
వివిధ ప్రాంతాల్లో ఇప్పటివరకు 248 వరకు ఫారం 7 దరఖాస్తులు అనుమానాస్పదంగా ఉన్నాయన్నారు.
