హైదరాబాద్  రోడ్లపై చెత్త పారేస్తున్నరా..? కెమెరా చూస్తది..అరుస్తది!..వీడియో తీసి ఫైన్లు వేస్తరు 

హైదరాబాద్  రోడ్లపై చెత్త పారేస్తున్నరా..? కెమెరా చూస్తది..అరుస్తది!..వీడియో తీసి ఫైన్లు వేస్తరు 
  • సిటీలో 2,500 సీసీ కెమెరాలు రెడీ  

హైదరాబాద్ సిటీ, వెలుగు:   నగరంలో ఎక్కడబడితే అక్కడ చెత్త పడేస్తున్నోళ్లకు చెక్‌‌ పెట్టేందుకు జీహెచ్‌‌ఎంసీ రెడీ అవుతోంది. ఎన్నిసార్లు అవగాహన కల్పించినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఇక టెక్నాలజీ సాయంతో చెత్త వేసేవారిని గుర్తించి జరిమానాలు విధించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గార్బేజీ వర్నరబుల్‌‌ పాయింట్లు (జీవీపీ) వద్ద తొలి విడతలో రూ.7 కోట్లతో 2,500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం స్వచ్ఛ ఆటో టిప్పర్ల ద్వారా ఇంటింటికీ చెత్త సేకరిస్తున్నా..కొందరు నెలసరి చెత్త సేకరణ ఛార్జీలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రోడ్లపై చెత్త పడేస్తున్నారు.

మరికొన్ని చోట్ల చెత్త సేకరణ సక్రమంగా జరగకపోవడంతో చెత్త కుండీలున్న ప్రాంతాల్లో  పడేస్తున్నారు. దీంతో ప్రతి సర్కిల్‌‌లో జీవీపీలు పెరుగుతున్నాయి. ఈ సమస్యకు చెక్‌‌ పెట్టేందుకు ఏర్పాటు చేయనున్న సీసీ కెమెరాలను పబ్లిక్‌‌ అడ్రస్‌‌ సిస్టమ్‌‌తో అనుసంధానించనున్నారు. ఎవరైనా  చెత్త పడేస్తే వెంటనే కెమెరాల్లో రికార్డవడంతో పాటు.. ‘ఇక్కడ చెత్త వేయొద్దు.. చెత్త వేస్తే కఠిన చర్యలు తప్పవు’ అంటూ హెచ్చరికలు వినిపించేలా సౌండ్​సిస్టమ్​కూడా ఏర్పాటు చేయనున్నారు. కెమెరాల ఏర్పాటు, టెస్టింగ్‌‌, ఆపరేషన్‌‌, నిర్వహణ బాధ్యతలు చేపట్టేలా అర్హత కలిగిన ఏజెన్సీల నుంచి జీహెచ్‌‌ఎంసీ ప్రతిపాదనలు కోరింది. చెత్త వేసేవారి వీడియోలను రికార్డు చేసి, అవసరమైతే వారిపై జరిమానాలు, ఇతర చర్యలు తీసుకునేందుకు సాక్ష్యాలుగా వినియోగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.