కుండపోత వర్షంలోనే కాక్రోచ్ పార్టీ నిరసనలు: తలదాచుకోవటానికి పట్టలు కూడా ఇవ్వటం లేదు

కుండపోత వర్షంలోనే కాక్రోచ్ పార్టీ నిరసనలు: తలదాచుకోవటానికి పట్టలు కూడా ఇవ్వటం లేదు

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలోని వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా చేపట్టిన ధర్నా గురువారం (జులై 8) నాటికి 20 రోజులకు చేరింది. రుతు పవనాల ప్రభావంతో ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ సీజేపీ వెనక్కి తగ్గడం లేదు.

 కుండపోత వర్షంలో తడుస్తూనే నిరసనలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే ఢిల్లీ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం (జులై 8) రాత్రి ఢిల్లీలో భారీ వర్షం కురిసినప్పటికీ నిరసన ప్రదేశంలోకి పట్టాలు (టార్పాలిన్ కవర్లు) తీసుకెళ్లడానికి పోలీసులు నిరాకరించారని ఆరోపించారు. విద్యార్థులు వర్షంలో తడుస్తూనే నిరసనలు కొనసాగించారని.. దీంతో కొందరు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. నిరసనకారులు వర్షంలో తడుస్తుంటే.. డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బంది మాత్రం సురక్షితంగా టెంట్ల కింద ఆశ్రయం పొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వర్షాల నేపథ్యంలో నిరసన ప్రదేశంలోకి టార్పలిన్ పట్టాలు తెచ్చుకుంటామని కోరగా.. పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారని ఆరోపించారు. మూడు రోజులుగా పోలీసులు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పై నుంచి ఆదేశాలు వచ్చే వరకు విద్యార్థులు తడిచిన పర్వాలేదా.. వాళ్ల ప్రాణాలు అంటే లెక్కలేదా అని పోలీసుల తీరుపై మండిపడ్డారు. 

 క్షీణిస్తోన్న వాంగ్‎చుక్ ఆరోగ్యం:

కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త, వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం మరింత క్షీణించింది. 11 రోజుల క్రితం దీక్ష ప్రారంభించినప్పటి నుంచి వాంగ్‌చుక్ ఏడు కిలోలకు పైగా బరువు తగ్గారని వైద్యులు తెలిపారు. వాంగ్ చుక్‎తో పాటు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ఐసా సభ్యుడు హృషికేష్ తీవ్ర ఆరోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.