మా తాత ఆస్తి.. మా ఇష్టం అంటే కుదరదు : వారసత్వ ఆస్తులపై ముంబై హైకోర్టు సంచలన తీర్పు

మా తాత ఆస్తి.. మా ఇష్టం అంటే కుదరదు : వారసత్వ ఆస్తులపై ముంబై హైకోర్టు సంచలన తీర్పు

వారసత్వ ఆస్తులపై బాంబే హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. పిల్లలకు ఇచ్చిన ఆస్తులను తల్లిదండ్రులు తిరిగి పొందే హక్కు కలిగి ఉంటారని స్పష్టం చేసింది. తల్లిదండ్రులు ఆర్థికంగా స్వతంత్రులైనప్పటికీ, భరణం కోసం పిల్లలపై ఆధారపడకపోయినా ఈ చట్టపరమైన రక్షణ వర్తిస్తుందని ధర్మాసనం తెలిపింది. 

తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర ఘుగే, జస్టిస్ గౌతమ్ అంఖడ్‌లతో కూడిన ధర్మాసనం..ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు వివరాల ప్రకారం, 68 ఏళ్ల తండ్రి 2005లో కొనుగోలు చేసిన ఫ్లాట్‌ను 2023లో తనను, తన భార్యను వృద్ధాప్యంలో చూసుకుంటారనే షరతుతో  కుమారుడికి బదిలీ చేశారు. అనంతరం కుటుంబ విభేదాల కారణంగా తల్లిదండ్రులు నివాసాన్ని విడిచిపెట్టాల్సి వచ్చిందని, వారు తల్లిదండ్రులు ,సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం-2007 కింద ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ 60 రోజుల్లో ఫ్లాట్‌ను ఖాళీ చేసి తల్లిదండ్రులకు అప్పగించాలని కుమారుడిని ఆదేశించింది.

తండ్రి ఆర్థికంగా స్వయం సమృద్ధుడని, వ్యాపారం నిర్వహిస్తున్నాడని, ఇతర ఆస్తులు కూడా ఉన్నాయని పేర్కొంటూ కుమారుడు హైకోర్టును ఆశ్రయించాడు. అయితే, 2007 చట్టంలోని సెక్షన్-23 అమలుకు సీనియర్ సిటిజన్ ఆర్థిక స్థితి ప్రమాణం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. సంరక్షణ కల్పిస్తామనే షరతుతో ఆస్తి బదిలీ జరిగి, ఆ బాధ్యతను నిర్వర్తించడంలో పిల్లలు విఫలమైతే లేదా నిరాకరిస్తే, ఆ బదిలీని చెల్లనిదిగా ప్రకటించే అధికారం చట్టం కల్పిస్తుందని ధర్మాసనం పేర్కొంది.

ఈ తీర్పు వృద్ధాప్యంలో సంరక్షణ, మద్దతు లభిస్తాయనే నమ్మకంతో ఆస్తులను పిల్లలకు బదిలీ చేసే సీనియర్ సిటిజన్ల హక్కులకు చట్టపరమైన రక్షణను మరింత బలపరిచింది.