హైదరాబాద్: ప్రజల్లో తనకు ఆదరణ లేదన్న స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీకి వస్తే ప్రజల్లో ఎవరికీ ఆదరణ ఉందో తెలుస్తుందని కౌంటర్ ఇచ్చారు. కడియం శ్రీహరి ఇప్పటికీ తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని ఎందుకు చెప్పుకుంటున్నారని.. పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలిచి నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే అని కాలర్ ఎగరేసి చెప్పుకోవచ్చు కదా అని అన్నారు. బిడ్డతో పాటే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కూడా కాంగ్రెస్ తరుఫున పోటీ చేయాల్సిందన్నారు.
కడియం శ్రీహరిపై పీసీసీకి ఫిర్యాదు:
తన పరిధిలోని దేవాదాయ శాఖపై కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించడంపై పీసీసీకి ఫిర్యాదు చేశానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. రివ్యూ చేసేందుకు తనకు అధికారం ఉందని ఆయన వక్రీకరించి మాట్లాడుతున్నారని అన్నారు. నేను ఎమ్మెల్యే.. నేను కమిషనర్ కార్యాలయానికి పోతానని ఆయన అంటున్నారు.. కడియం శ్రీహరిని దేవాదాయ శాఖ కార్యాలయానికి పోవద్దని ఎవరు అనడం లేదు. ఎండోమెంట్ హెడ్ ఆఫీసులో రివ్యూ చేయడం తప్పని అన్నారు. కమిషనర్ ఆఫీస్‌కి వెళ్లడం తప్పు కాదు.. ఆఫీసులో అధికారికంగా రివ్యూ చేయడం తప్పని పేర్కొన్నారు. దేనికైనా ఒక పద్దతి, ప్రోటోకాల్ ఉంటుందని హితవు పలికారు. కడియం శ్రీహరి నేను సీనియర్ అంటారు.. మరీ ఎమ్మెల్యే పరిధి ఏంటో ఆయన తెలియదా అని ప్రశ్నించారు.
