- హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల
- తనిఖీలతో మారుతున్న రెస్టారెంట్లు
- పలు చోట్ల లైవ్ కిచెన్ డిస్ ప్లే స్క్రీన్స్ ఏర్పాటు
- కస్టమర్లకు నమ్మకం కలిగించేందుకు
- మారుతున్న యాజమాన్యాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల వరుస తనిఖీలతో రెస్టారెంట్లలో మార్పు మొదలైంది. రెస్టారెంట్లకు వెళ్లాలంటేనే భయపడుతున్న కస్టమర్లను తిరిగి రప్పించుకునేందుకు కొన్ని రెస్టారెంట్లు లైవ్ కిచెన్ డిస్ ప్లే స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఫుడ్ తయారు చేసే విధానాన్ని స్క్రీన్‌పై లైవ్ చూసే అవకాశం ఉండడంతో కస్టమర్లు కూడా ఈ విధానాన్ని మెచ్చుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిరంతరం కొనసాగుతున్నాయి.
స్టార్ హోటళ్ల నుంచి చిన్న రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్ల వరకు తనిఖీలు నిర్వహిస్తూ అపరిశుభ్రమైన కిచెన్లు, గడువు ముగిసిన ముడి పదార్థాలు, గ్లోవ్స్, హెయిర్ క్యాప్స్ లేకుండా వంట చేస్తున్న సిబ్బంది, గడువు ముగిసిన లైసెన్సులు వంటి అనేక ఉల్లంఘనలను అధికారులు బయటపెడుతున్నారు. ఈ తనిఖీల వివరాలు మీడియాతో పాటు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వినియోగదారులు కూడా ఆహార పరిశుభ్రతపై మరింత అప్రమత్తమయ్యారు.
దీంతో కస్టమర్ల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు నగరంలోని పలు రెస్టారెంట్లు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నాయి. కస్టమర్లకు వడ్డించే ఆహారం ఎలా తయారవుతోంది..? కిచెన్ ఎంత పరిశుభ్రంగా ఉంది..? సిబ్బంది హైజీన్ పాటిస్తున్నారా..? ఇవన్నీ ఇప్పుడు కస్టమర్లే ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కొన్ని రెస్టారెంట్లు కల్పిస్తున్నాయి. కస్టమర్ల విశ్వాసాన్ని పెంచేందుకు, ఆహార తయారీలో పారదర్శకత తీసుకురావడానికి లైవ్ కిచెన్ డిస్ప్లే స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నాయి.
రెస్టారెంట్ లోకి అడుగుపెట్టిన వెంటనే కస్టమర్లకు కనిపించేలా పెద్ద డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్క్రీన్లకు నేరుగా కిచెన్‌లోని సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తున్నారు. కస్టమర్ ఆర్డర్ చేసిన ఆహారాన్ని కిచెన్ లో ప్రిపేర్ చేసే నుంచి తీసుకొచ్చే వరకు లైవ్ లో చూసే వెలుసుబాటు కల్పించారు. దీంతో కిచెన్‌లో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలంటే ఇక ప్రత్యేకంగా లోపలికి వెళ్లాల్సిన అవసరం లేదు.
కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్
ఈ కొత్త విధానానికి కస్టమర్ల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఇంతకుముందు ఆహారం రుచి బాగుందా లేదా అన్నదే ప్రధానంగా చూసేవారు. ఇప్పుడు ఆహారం తయారయ్యే విధానం, కిచెన్ పరిశుభ్రత, సిబ్బంది హైజీన్, ఫుడ్ హ్యాండ్లింగ్ వంటి అంశాలను కూడా గమనిస్తున్నారు. పరిశుభ్రమైన కిచెన్ కనిపిస్తే ఆ రెస్టారెంట్‌పై నమ్మకం పెరుగుతోందని, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసేందుకు మరింత ధైర్యంగా వస్తున్నామని పలువురు కస్టమర్లు చెబుతున్నారు.
నగరంలో ఉన్న అన్ని రెస్టారెంట్లు ఇలా లైవ్ కిచెన్ డిస్ ప్లే స్క్రీన్ లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ స్క్రీన్ల ఆధారంగా కూడా ఆయా హోటల్స్, రెస్టారెంట్లకు రేటింగ్ పెరిగే ఛాన్స్ ఉంది. కస్టమర్ల ముందు అంతాకనిపించినప్పుడు గూగుల్ లో వారే మంచి రేటింగ్ ఇచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఆయా హోటల్స్, రెస్టారెంట్లకు కూడా బిజినెస్ పెరిగే అవకాశం కూడా ఉంది.
యాజమాన్యాలకు పెరిగిన బాధ్యత
లైవ్ కిచెన్ డిస్ ప్లేలు ఏర్పాటు చేయడంతో కేవలం కస్టమర్లకే కాకుండా, హోటల్స్, రెస్టారెంట్ సిబ్బందిలో కూడా బాధ్యత పెరిగిందని యాజమాన్యాలు చెబుతున్నాయి. కస్టమర్లు ఎప్పటికప్పుడు తమ పనిని గమనిస్తున్నారనే భావనతో పరిశుభ్రత విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు. చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, గ్లోవ్స్ మార్చడం, ముడి పదార్థాలను సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు చెబుతున్నారు.
అంతా ఓపెన్
కేవలం వంట చేసే కిచెన్ మాత్రమే కాకుండా రెస్టారెంట్‌లో ఆహార పదార్థాలు నిల్వ చేసే ప్రతి కీలక ప్రాంతాన్ని కూడా ఇప్పుడు కస్టమర్లకు చూపిస్తున్నారు. నాన్‌వెజ్ స్టోరేజ్ రూమ్, కూరగాయలు, పండ్లు నిల్వ చేసే కోల్డ్ స్టోరేజ్, డెయిరీ ఉత్పత్తులు, సాస్‌లు, మసాలా దినుసులు ఉంచే ఫుడ్ స్టోర్లు, డీప్ ఫ్రీజర్లు, వాషింగ్ ఏరియా, ఫుడ్ ప్రిపరేషన్ జోన్‌లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని లైవ్ డిస్ప్లే స్క్రీన్‌కు అనుసంధానం చేశారు.
దీంతో కస్టమర్లు ప్రత్యక్షంగా గమనించే అవకాశం కలుగుతోంది. వరుస ఫుడ్ సేఫ్టీ తనిఖీలతో మొదలైన ఈ మార్పు పారదర్శకతను పెంచడమే కాదు, రెస్టారెంట్ల మధ్య నాణ్యత కోసం ఆరోగ్యకరమైన పోటీని కూడా తీసుకొస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో మరిన్ని హోటళ్లు ఈ విధానాన్ని అమలు చేస్తే వినియోగదారులకు మరింత సురక్షితమైన ఆహారం అందే అవకాశముంది.
